Kiara Advani: బాలీవుడ్ ప్రముఖ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. వారి అభిమానులు, సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్త ఇది. కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇది వారికి మొదటి బిడ్డ కావడంతో రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ శుభవార్తతో కియారా, సిద్ధార్థ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా అంతటా ఈ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కియారా ప్రెగ్నెన్సీ ఫోటోలు, ముఖ్యంగా ఇటీవలి మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ 2025లో బేబీ బంప్‌తో ఆమె కనిపించినప్పటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు2 అప్డేట్‌తో అభిమానుల్లో ఉత్సాహం?
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమాయణం బాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన కథ. ‘లస్ట్ స్టోరీస్’ సినిమా ముగింపు పార్టీలో మొదటిసారి కలిసిన ఈ ఇద్దరు తారలు, ఆ తర్వాత ‘షేర్షా’ సినిమా సెట్స్‌లో మరింత దగ్గరయ్యారు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. 2019లో వారి డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత 2021లో, ఇద్దరూ తమ కుటుంబాలను కలుసుకున్నారు.
చివరికి, 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వారి పెళ్లి బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న, సిద్ధార్థ్, కియారా తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. అప్పటి నుంచి ఈ శుభవార్త కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.