Malakpet: రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నగరంలోని మలక్‌పేట, శాలివాహన నగర్‌లోని ఓ పార్కు వద్ద సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ (47) గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన నగరవాసులను, ముఖ్యంగా స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.
మంగళవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో చందు నాయక్ తన భార్య, కుమార్తెతో కలిసి శాలివాహన నగర్ పార్కులో ఉదయపు నడకకు వచ్చారు. అందరూ చూస్తుండగానే, ఒక స్విఫ్ట్ కారులో వచ్చిన ముగ్గురు నుంచి నలుగురు దుండగులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. తొలుత ఆయన కళ్లలో కారం కొట్టి, ఆ తర్వాత ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చందు నాయక్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు వెంటనే కారులో పరారయ్యారు.
Also Read: ACB Raids: మాజీ E.N.C. మురళీధర్‌రావు నివాసాలపై ఏసీబీ సోదాలు
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు చందు నాయక్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, నర్సాయిపల్లి అని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో భూ తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. చందు నాయక్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవరుప్పలకు చెందిన సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేష్‌పై అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఘటనా స్థలాన్ని డీసీపీ చైతన్య కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకే ఆయుధంతో కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పార్కు సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను, ఆ ప్రాంతంలోని ఇతర కెమెరాల ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన కారును గుర్తించినట్లు డీసీపీ తెలిపారు, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. పాత కక్షలు, ఇతర కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. నగరంలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.