Ashok Gajapathi Raju: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులు కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ నియామకం నేపథ్యంలో విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన మనోభావాలను పంచుకున్నారు.
“నా పేరును గోవా గవర్నర్ పదవికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిఫార్సు చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ అవకాశాల కోసం పరుగులు తీయలేదు. ఏ అవకాశం వచ్చినా, దానిని బాధ్యతగా స్వీకరించాను” అని అశోక్ గజపతిరాజు అన్నారు. ఈ నియామకం ద్వారా తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత తనపై ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Delhi: జల వివాదాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం: ఢిల్లీలో కేంద్ర మంత్రి నేతృత్వంలో కీలక భేటీ
“ఓటమితో నిరుత్సాహ పడనక్కర్లేదు. దాని నుంచి పాఠాలు నేర్చుకుని మరింత ఉన్నతంగా ముందుకు వెళ్లవచ్చు” అని ఆయన యువతకు, తన అభిమానులకు సందేశం ఇచ్చారు. గోవా అనగానే తన ప్రియ మిత్రుడు, దివంగత మనోహర్ పారికర్ గుర్తుకొస్తారని అశోక్ గజపతిరాజు స్మరించుకున్నారు. పారికర్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కోరుకొండ సైనిక్ స్కూల్‌లో అమ్మాయిలకూ చదువుకునే అవకాశం కల్పించాలని తాను కోరానని గుర్తుచేసుకున్నారు.
దేశానికి సేవ చేసే అవకాశం మరోసారి లభించడం ఎంతో సంతోషంగా ఉందని అశోక్ గజపతిరాజు తెలిపారు. తనకు అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు చెప్పారు. నిజాయితీ, నిబద్ధతకు మారుపేరుగా నిలిచే అశోక్ గజపతిరాజు, గోవా గవర్నర్‌గా సమర్థవంతమైన సేవలు అందిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియామకం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో, హర్షం వ్యక్తమవుతోంది.