Nimisha Priya: కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ జీవితం యెమెన్‌లో మరణం అంచున ఉంది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు కానుండగా, ఆమె ప్రాణాలు కాపాడేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. భారత్-యెమెన్‌ల మధ్య దౌత్య సంబంధాలు లేకపోవడంతో, నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపడం లేదా వాయిదా వేయడం దాదాపు అసాధ్యమని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు.
కేంద్రం వైపు నుంచి దౌత్యపరమైన జోక్యం సాధ్యం కాదని, రక్తపు డబ్బు (బ్లడ్ మనీ) చెల్లించి క్షమాపణ కోరే ప్రయత్నాలు పూర్తిగా ప్రైవేటు సంప్రదింపుల ద్వారానే జరగాలని ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, ఈ ఘటన చాలా ఆందోళనకరమని, నిమిష ప్రియ ప్రాణాలు కోల్పోతే అది అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. జూలై 10న సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు అంగీకరించి, నేటికి వాయిదా వేసింది.
మరోవైపు, నిమిష ప్రియ ప్రాణాలను కాపాడాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిన్న కేంద్రానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆమెను విడిపించాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు పంపిన లేఖలో కోరారు. నిమిష ప్రియ కుటుంబం ఆమెను కాపాడేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తోంది. మృతుడి కుటుంబానికి 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.6 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. యెమెన్ చట్టాల ప్రకారం, బాధితుడి కుటుంబం క్షమించడానికి అంగీకరిస్తే ఉరిశిక్షను ఆపవచ్చు. అయితే, ఈ ఆఫర్‌పై మృతుడి కుటుంబం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదని బాబుజాన్ అనే సామాజిక కార్యకర్త తెలిపారు.
Also Read: PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లో రూ.600 కోట్లకు పైగా అవినీతి
నిమిష ప్రియ కథనం విచారకరమైన మలుపులతో నిండి ఉంది. 2008లో నర్సుగా యెమెన్‌కు వెళ్లిన నిమిష ప్రియ, 2011లో థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని తిరిగి యెమెన్‌కు వెళ్లింది. అక్కడ ఒక క్లినిక్ ప్రారంభించాలని భావించి, యెమెన్ నిబంధనల ప్రకారం స్థానిక భాగస్వామి తలాల్ అదిబ్ మెహదితో కలిసి అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించింది.
తర్వాత భారత్‌కు వచ్చి తిరిగి వెళ్ళాక, మెహది ఆమెను వేధించడం ప్రారంభించాడని, డబ్బు లాక్కోవడంతో పాటు ఆమె పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మెహది ఆమెను తన భార్యగా చెప్పుకుంటూ, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వలేదని తెలుస్తోంది. 2016లో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
చివరకు 2017లో, తన పాస్‌పోర్ట్ తిరిగి పొందడానికి నిమిష ప్రియ మెహదికి మత్తుమందు ఇచ్చింది. అయితే, మోతాదు ఎక్కువ కావడంతో అతను మరణించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో పారేసి, సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉంది, ఇప్పుడు మరణశిక్ష ఎదుర్కొంటోంది.
ఆఖరి నిమిషం ప్రయత్నాలు ఫలిస్తాయా, యెమెన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.