HHMV: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికేట్ పొందింది. చిత్రానికి మొత్తం 2 గంటల 42 నిమిషాలు 30 సెకన్లు రన్‌టైమ్ ఉంది. ఈ భారీ పిరియాడికల్ యాక్షన్ డ్రామా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఒక ధైర్యవంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు. చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతికృష్ణ ఈ చిత్రానికి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, సునీల్, నాజర్, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే, సినిమా విడుదలకు ముందు జూలై 20న ఒక భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నారు. ఈ ఈవెంట్‌ను విశాఖపట్నం సముద్రతీరంలో నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ వేడుకకు పవన్ అభిమానులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు హాజరవుతారని సమాచారం.