AP news: శ్రీకాళహస్తి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న కోట వినుతపై తీవ్ర ఆరోపణలు ఎదురయ్యాయి. ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురు వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హత్య కేసు వివరాలు
దాదాపు రెండు వారాల క్రితం డ్రైవర్ రాయుడును వినుత విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత చెన్నైలోని కూవం నదిలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహంపై జనసేన పార్టీ గుర్తు, కోట వినుత పేరు ఉన్న టాటూలను గుర్తించిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసిన దర్యాప్తులో రాయుడిని చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు తేలింది.
నిందితుల అరెస్టు
కేసులో కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, శివకుమార్, గోపి, దాసర్ అనే ముగ్గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని శ్రీకాళహస్తికి తరలించి మరింత విచారణ చేపట్టారు.
జనసేన క్రమశిక్షణ చర్య
ఈ ఘటనపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. కోట వినుత పార్టీ ఆచార ధోరణులకు విరుద్ధంగా వ్యవహరించిందని, గత కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్లు పార్టీ ప్రకటనలో పేర్కొంది. హత్య కేసులో ఆమె అరెస్ట్ అయిన నేపథ్యంలో తక్షణమే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించిది.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, “పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, చట్టవిరుద్ధ చర్యల్లో భాగస్వామ్యం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం,” అని స్పష్టం చేశారు.
పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం
ఈ ఘటనతో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలపై క్రమశిక్షణ చర్యలు ఎంత ఖచ్చితంగా తీసుకుంటారో మరోసారి స్పష్టమైంది. నేరానికి పాల్పడే వారిపై మినహాయింపు లేదని పార్టీ ఈ చర్య ద్వారా సంకేతం పంపినట్టయింది.
