CM Chandrababu: కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదికను సమర్పించారు.
రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు చదువుతున్న విద్యార్థినుల పట్ల కొందరు సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా, ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లపై ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈనెల 8న కొందరు విద్యార్థినులు అధ్యాపకుల వద్ద తమ గోడు వెళ్లబోసుకోవడంతో ఈ విషయం బయటపడింది. వెంటనే కళాశాల అంతర్గత కమిటీ ద్వారా విచారణ ప్రారంభించారు.
Also Read: Ajit Doval: అజిత్ డోభాల్ సవాల్: ‘ఆపరేషన్ సింధూర్’లో భారత్‌కు నష్టం జరిగిందని నిరూపించండి
విచారణ కమిటీ ముందు దాదాపు 50 మంది విద్యార్థినులు తమకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో పనిచేసే కొందరు సిబ్బంది తమ శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి వికృత చేష్టలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉండగా అసభ్యకరమైన ఫోటోలు తీసి వాట్సాప్‌లకు పంపించడం, తమను రూమ్‌కు రమ్మని బెదిరించడం, డబ్బులు ఆశ చూపడం వంటి దారుణాలకు ఒడిగట్టారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈనెల 9న కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈ విషయమై అధికారికంగా ఫిర్యాదు అందింది.
ఘటన తీవ్రతను గుర్తించిన అధికారులు వెంటనే విచారణ చేపట్టి, గురువారం రాత్రికి నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదిక ఆధారంగా, వేధింపులకు పాల్పడిన ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదనంగా, ఈ నలుగురిపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. కాకినాడ జీజీహెచ్ అధికారులు ఘటన వివరాలను, తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో, నిందితులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థినులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.