తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడినట్లు చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. ఇదే అంశం ఇప్పుడు రాజకీయ చర్చకు వేదికగా మారింది. ఈలోగా కర్ణాటకలోని ధర్మాదాయ శాఖ ఆలయాల్లో నందిని నెయ్యి తప్పనిసరిగా వాడాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కర్ణాటక రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి ధార్మిక దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు సర్క్యులర్ జారీ చేసి ఆలయ సేవలు, దీపాలు, ప్రసాదాల తయారీ, ఇతర దైవిక కార్యక్రమాల్లో నందిని నెయ్యి తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు.తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నట్లు టీటీడీ అంగీకరించింది. లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వాడిన మాట వాస్తవమేనని లడ్డూలకు ఉపయోగించే ముడిసరుకు ల్యాబ్ రిపోర్టు రావడంతో విలేకరుల సమావేశం నిర్వహించిన టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు అంగీకరించారు.
అదేవిధంగా తిరుపతిలో తయారు చేసిన లడ్డూకు ఉపయోగించే నెయ్యి నమూనా పరీక్ష నిర్వహించారు. ఆ నెయ్యిలో చేపనూనె, పామాయిల్ దొరికాయి. ఆశ్చర్యం ఏంటంటే.. గొడ్డు మాంసం నుంచి తీసివేసిన కొవ్వు, పంది మాంసం పొరలో తీసిన తెల్ల కొవ్వు నెయ్యిలో ఉన్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది.
గతంలో తిరుపతి లడ్డూ తయారీకి కర్ణాటక నందిని నెయ్యిని ఉపయోగించేవారు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాలుగా తిరుపతికి నందిని నెయ్యి సరఫరా కాలేదు. అందుకే, నెయ్యి కల్తీకి మాకు ఎలాంటి సంబంధం లేదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ నిన్న చెప్పారు. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చను లేపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా కల్తీ నెయ్యి వాడడం పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి