Gulf countries: తెలంగాణ పల్లెలకు గల్ఫ్ దేశాల వసల కష్టాలు ఇంకా తీరడం లేదు. కష్టపడి ఎంతోకొంత సంపాదించుకొని కుటుంబానికి ఆసరా అవుదామనుకొని వెళ్లిన యువత.. అక్కడి ఏజెంట్లు, యాజమాన్యాల చేతుల్లో బలవుతున్న ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డ్రైవింగ్ చేద్దామని వెళ్లిన ఓ యువకుడు మోసపోయాడు. తీరా తన భావి జీవితాన్నీ కోల్పోయాడు.
Gulf countries: సిరిసిల్ల జిల్లా నూకలమర్రి గ్రామానికి చెందిన రాజు (21) డ్రైవింగ్ పనికోసం 10 రోజులు క్రితం సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక.. అక్కడి యాజమానులు అతనితో గొర్రెలు మేపడం, ఎడారిలో కూలిపనులు చేయంచుకున్నారు. దీంతో మోసపోయానని రాజు తెలుసుకున్నాడు. ఎన్నో కలలతో వెళ్లిన ఆ యువకుడికి కల్లలే మిగిలాయి.
Gulf countries: తాను వచ్చింది డ్రైవింగ్ కోసమని, తాను ఈ పనులు చేయబోనని రాజు అక్కడి యాజమానికి ఎదురు తిరిగాడు. అదే అతడు చేసిన తప్పయింది. అయినా తప్పదని చేయాల్సిందేనని అక్కడి యజమానులు బెదిరించారు. తనకు డ్రైవింగ్ పనులు చెప్పాలంటూ వారిని ప్రశ్నించాడు. దీంతో అక్కడి యజమాని రాజుపై తీవ్రంగా దాడి చేశాడు.
Gulf countries: ఇక తాను ఆ పనులు చేయబోనని, బతికి ఉంటే బలుసాకు తినైనా బతుకుతానని రాజు స్వదేశానికి తిరిగివచ్చాడు. అయితే అక్కడి యజమాని తీవ్రంగా కొట్టిన దెబ్బలతో కడుపునొప్పి లేవసాగింది. దీంతో ఇక్కడికి వచ్చాక ఆసుపత్రిలో చేరాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో నిన్న (జూన్ 10) రాత్రి రాజు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఏజెంట్ల మోసాలు, గల్ఫ్ దేశాల యాజమానుల దౌర్జన్యాలతో ఎందరో బలయ్యారు. వారిలో రాజు కూడా చేరిపోయాడు.