Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో నిరుద్యోగం ఒక యువకుడి ప్రాణాలు తీసింది. ఉద్యోగం దొరకలేదనే మనస్తాపంతో లోకం శ్రీకాంత్ (25) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలచివేసింది.
నర్మల గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్ ఉన్నత చదువులు చదివాడు. చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. కానీ, ఎన్నో ప్రయత్నాలు చేసినా, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఎంత తిరిగినా శ్రీకాంత్‌కు ఉద్యోగం దొరకలేదు. నిరుద్యోగం వెంటాడుతుండటంతో అతను తీవ్రమైన మానసిక ఒత్తిడికి, నిరాశకు గురయ్యాడు.
ఈ మనస్తాపం భరించలేకపోయిన శ్రీకాంత్, గ్రామంలోని ఒక చెట్టుకు ఉరేసుకుని తన జీవితాన్ని ముగించాడు. ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉద్యోగం రావడం లేదనే బాధతోనే తమ కొడుకు ఈ దారుణానికి పాల్పడ్డాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీకాంత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

