Adulterated Toddy: భాగ్యనగరంలో కల్తీ కల్లు మరోసారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కూకట్‌పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు సేవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 31 మంది బాధితులు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 37 మంది కల్తీ కల్లు ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది.
మృతులను సీహెచ్ బొజ్జయ్య, కలగళ్ల సీతారాం, చౌదరిమెట్టు స్వరూప, నారాయణ, మౌనికగా గుర్తించారు. ఈ కల్తీ కల్లు ఘటన మొదట సాధారణంగానే కనిపించినా, మృతులు, బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాధితులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. కొందరు వెంటిలేటర్‌పై, మరికొందరు డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు నిర్వాహకులపై పోలీసులు, అబ్కారీ శాఖ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో బాలానగర్ అబ్కారీ పోలీస్ స్టేషన్‌లో ఐదు కేసులు, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read: Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
Adulterated Toddy: ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఒక కల్లు దుకాణంలో 66 గ్రాముల తెలుపు రంగు పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కల్లులో నెఫ్రో టాక్సిక్స్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కస్టమర్లను మత్తుకు బానిసలను చేసి, ఎక్కువ లాభాలు సంపాదించడం కోసం నిర్వాహకులు క్లోరల్ హైడ్రేట్, అల్ఫ్రాజోలం, డైజోఫామ్ వంటి రసాయనాలను కలుపుతున్నారని, నురుగు కోసం అమ్మోనియం వంటి పదార్థాలు కూడా వాడుతున్నారని పోలీసులు గుర్తించారు.
వైద్యుల హెచ్చరికల ప్రకారం, ఈ రసాయనాలతో కూడిన కల్తీ కల్లు నరాలు, మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటి ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. ఇది కడుపులో గ్యాస్‌ను పెంచి వాంతులకు దారితీస్తుంది, బాధితులు స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. కోమాలోకి వెళ్ళిన వారికి సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాపాయం ఉంటుందని, వారిని సాధారణ స్థితికి తీసుకురావడం కష్టమని వైద్యులు అంటున్నారు. కంటి చూపు మసకబారడం, ఫిట్స్ రావడం, మానసిక స్థితి కోల్పోవడం, పిచ్చిగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ అవసరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.