Cm chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను జీరో క్రైమ్ రేట్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన రియల్ టైమ్ గవర్నెన్స్ సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
క్రైమ్ కంట్రోల్‌కు సీసీ కెమెరాలు – ప్రైవేట్ ఫుటేజీ వినియోగానికి మార్గదర్శకాలు
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలను కీలకంగా ఉపయోగించాలని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా క్రైమ్ హాట్స్పాట్లపై నిరంతర నిఘా పెట్టాలని, ప్రైవేట్ సీసీ కెమెరాల ఫుటేజీ సేకరణకు సంబంధించి నూతన నిబంధనలు రూపొందించాలని సూచించారు. నేరాల నివారణకు ప్రైవేట్ కెమెరాలు కూడా వినియోగంలోకి తేవాలని తెలిపారు.
రాజకీయ ముసుగులో నేరాలు – టెక్నాలజీతో ఎదుర్కోవాలి
రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వ్యక్తులపై టెక్నాలజీ ద్వారా దర్యాప్తు జరపాలని సీఎం పేర్కొన్నారు. పోలీసులకు సహకరించని నేతలు, వ్యక్తులపై పబ్లిక్ సేఫ్టీ యాక్టు కింద డేటా సేకరించాలని, వారికి సంబంధించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
డ్రోన్లు, సీసీ కెమెరాలతో శాంతిభద్రతల పర్యవేక్షణ
పబ్లిక్ ప్రదేశాల్లో భద్రతను మరింతగా పెంచేందుకు డ్రోన్లను, సీసీ కెమెరాలను విస్తృతంగా వినియోగించాలని సీఎం ఆదేశించారు. ఓర్వకల్లులో అభివృద్ధి చెందుతున్న డ్రోన్ సిటీపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రికార్డుల భద్రత
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కీలక డేటా భద్రత కోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించాలని చంద్రబాబు సూచించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో పాటు, వాటిని డేటా లేక్‌తో సమన్వయం చేయాలని ఆదేశించారు.
వాతావరణ హెచ్చరికలు – ప్రజల ప్రాణ రక్షణకు చర్యలు
పిడుగులు పడే ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికల వ్యవస్థ సమర్థంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. సైరన్ల ద్వారా ప్రజలను హెచ్చరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. భూగర్భ జలాల పర్యవేక్షణకు సెన్సార్లు, ఫీజియో మీటర్లు వేగంగా పునరుద్ధరించాలని ఆదేశించారు.
వరద నివారణకు రియల్ టైమ్ డేటా వాడకం
రిజర్వాయర్ల నీటి ప్రవాహాలపై రియల్ టైమ్ డేటాను నమోదు చేసి వరదల నిర్వహణకు వినియోగించాలని పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల అలల ఉధృతి, చేపల వేటకు అనుకూలమైన ప్రాంతాల సమాచారం మత్స్యకారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమర్థవంతమైన సేవలు – పౌరులకు యూజర్ ఫ్రెండ్లీ పాలన
ప్రస్తుతం 517 ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. అయితే, ఈ సేవలన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.
పథకాల రూపకల్పనలో డేటా సమన్వయం
ప్రతి శాఖ తమ వద్ద ఉన్న లబ్దిదారుల డేటాను ఆర్టీజీఎస్తో సమన్వయం చేసుకోవాలని, ఏవైనా తేడాలు ఉంటే వెంటనే అప్డేట్ చేయాలని సూచించారు. 2029 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని చెప్పారు. చివరి వ్యక్తికి సంక్షేమం అందేలా పథకాల రూపకల్పన జరగాలని తెలిపారు.

