vakiti srihari: తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా పూర్తిగా దెబ్బతిన్న శాఖలను తనకు అప్పగించారని వ్యాఖ్యానించిన ఆయన, ఇవి తన అదృష్టమో లేక దురదృష్టమో ఇంకా అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు కేటాయించిన ఐదు శాఖలన్నీ చాలా అసంపూర్ణంగా ఉన్నాయి. పశుసంవర్థక శాఖ మొత్తం గందరగోళంగా ఉంది. యువజన సేవలు ఇచ్చి నన్ను ఏమి చేసుకోమంటారు? ‘గొర్రెలు, బర్రెలు ఇస్తే వాటితో నేను ఏం చేయాలి?’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరైతే ఇవి బాధ్యతలపై వ్యక్తిగత అభిప్రాయాలుగా అభివర్ణిస్తున్నప్పటికీ, మరికొంతమంది మాత్రం అవి అసంతృప్తి సంకేతంగా భావిస్తున్నారు.
క్రీడల అభివృద్ధికి హామీలు
ఇంతకుముందు కరీంనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, మంత్రి శ్రీహరి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్‌తో పాటు కబడ్డీ, హ్యాండ్‌బాల్ కోర్టులు నిర్మించనున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా, హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ లలో కొత్త క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కరీంనగర్ క్రీడా పాఠశాలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తామన్న హామీ కూడా ఇచ్చారు.