Case on Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ వార్త జనసైనికులను ఆశ్చర్యానికి గురిచేసినా, ఇందులో ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు అంటున్నారు పరిశీలకులు. ఈ కేసు తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. గత నెలలో మధురైలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన మురుగన్ మానాడు సమ్మేళనంలో పవన్ కీలక ప్రసంగం చేశారు. సూడో సెక్యులరిజంపై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ వర్గాలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ప్రసంగం తర్వాత, తమిళనాడుకు చెందిన న్యాయవాది వాంజినాథన్… పవన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పవన్ ప్రసంగం తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా షేక్ చేసిందని చెప్పాలి. నకిలీ లౌకికవాదులపై ఆయన చేసిన విమర్శల దాడి, మురుగన్ భక్తుల సమ్మేళనంలో ఆయన చూపిన ధైర్యం, తమిళ రాజకీయ నాయకులను ఉలిక్కిపడేలా చేసింది. డీఎంకే నేత, మంత్రి శేఖర్ బాబు ఇదివరకే పవన్‌ను ఉద్దేశించి… తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దనీ, మీకు ఇక్కడేం పనంటూ ప్రశ్నించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవమని సవాల్ విసిరారు. ఇక తెలుగు వారికి కట్టప్పగా సుపరిచితుడైన ప్రముఖ నటుడు సత్యరాజ్ ముందుకొచ్చి పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. తమిళ ప్రజలు తెలివైన వారనీ, మీ ఆటలు ఇక్కడ సాగవు అని పవన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికలు, పవన్ ప్రసంగం తమిళనాడు రాజకీయ వర్గాల్లో సృష్టించిన సునామీకి స్పష్టమైన నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read: Mahaa Conclave On Education: జగన్ VS లోకేష్.. ప్రభుత్వ పాఠశాలలో ఎవరి మార్క్ ఎంత
Case on Pawan Kalyan: అయితే, ఈ కేసు తమిళనాట పవన్ కళ్యాణ్ క్రేజ్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. తమిళనాడులో ఎన్డీయే కూటమికి పవన్ ఒక బలమైన ముఖంగా మారారు. మురుగన్ మానాడులో ఆయన ప్రసంగం బీజేపీ అనుకూల ఓటర్లను, ముఖ్యంగా యువతను, భక్తులను ఆకర్షించింది. ఈ కేసు వల్ల పవన్‌పై ఫోకస్ మరింత పెరిగింది. ఇది ఎన్డీయే కూటమికి కలిసొచ్చే అంశంగా మారింది. ఇప్పటికే ఏపీలో జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడిని ఎదిరించి, అరాచక పాలనను అణచివేసి, డిప్యూటీ సీఎం స్థాయికి చేరిన పవన్… ఇలాంటి కేసులకు భయపడే వ్యక్తి కాదు. ఆయన ధైర్యం, స్పష్టమైన రాజకీయ విధానం ఆయనను అసామాన్యమైన రాజకీయ శక్తిగా నిలిపాయి. తమిళనాడు ప్రభుత్వం సత్యరాజ్ లాంటి వారితో హెచ్చరికలు చేయించడం అంటే, పవన్ ప్రభావానికి భయపడినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈ ఘటనలు బీజేపీకి తమిళనాడులో బలం చేకూర్చే అవకాశం ఉంది.
పవన్ ప్రసంగం తమిళనాడులో కొత్త చర్చను రేకెత్తించింది. సెక్యులరిజం పేరుతో రాజకీయ లబ్ధి పొందే వారిపై ఆయన చేసిన విమర్శలు, మురుగన్ భక్తులను ఏకం చేసే ప్రయత్నం, బీజేపీకి కొత్త ఊపిరి పోసాయి. తమిళనాడులో బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది, కానీ పవన్ లాంటి శక్తివంతమైన నాయకుడి ప్రసంగం, ఆ తర్వాత వచ్చిన వివాదం, ఆ పార్టీకి కొత్త ఊపు తెచ్చాయి. ఈ కేసు, హెచ్చరికలు పవన్‌ను బలహీనపరచకపోగా, ఆయనను, ఎన్డీయే కూటమిని తమిళనాడులో మరింత శక్తిమంతంగా నిలిపాయి.

