Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన, పాకిస్థాన్ పాలకులు పూర్తిగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పాలకుల బానిసత్వంలో జీవించడానికి కంటే జైలు చీకటి గదిలో జీవించడానికే తాను ఇష్టపడతానని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 26వ రాజ్యాంగ సవరణ ప్రజాస్వామ్య మూల సూత్రాలను నాశనం చేసిందని ఆరోపించారు. ఓటు హక్కు, చట్టపరమైన పాలన, నైతిక విలువలు, మీడియా స్వేచ్ఛలు ప్రజాస్వామ్యంలో కీలకమైన నాలుగు స్తంభాలు అని చెబుతూ, ఈ సవరణతో అవన్నీ నాశనమయ్యాయని పేర్కొన్నారు.
జులై 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాలని తన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తన సందేశాలు ప్రజల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా విమర్శించారు. నియంత పాలన వస్తే ప్రజల ఓట్లకు విలువ ఉండదని, ఇష్టం వచ్చినట్లు ప్రయోగాలు చేస్తూ దేశాన్ని నడుపుతారని సూచించారు. న్యాయవ్యవస్థపై కూడా విమర్శలు చేశారు. స్వతంత్రంగా పనిచేసే న్యాయమూర్తులు ఇక శక్తివంతంగా ఉండటం లేదని, ఎంచుకున్న కొందరు మాత్రమే తీర్పులు ఇస్తున్నారని ఆరోపించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ నశించిపోతోందని, నిజాయితీగా పని చేసే పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు.

