B.V. Pattabhiram: ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్ట్ డాక్టర్ బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. సోమవారం (జూన్ 30) రాత్రి 9:45 గంటలకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. దాదాపు అర్థ శతాబ్దం పాటు ఇంద్రజాలికుడిగా, సైకాలజిస్టుగా సమాజానికి సేవలందించిన ఆయన మృతి విద్యా, మానసికారోగ్య రంగాలకు తీరని లోటు.
డాక్టర్ బీవీ పట్టాభిరామ్ పూర్తి పేరు భావరాజు వేంకట పట్టాభిరామ్. ఆయన 1949లో తూర్పుగోదావరి జిల్లాలో రావ్ సాహెబ్ భావరాజు సత్యనారాయణ 15 మంది సంతానంలో ఒకరిగా జన్మించారు. కౌమారదశలో కాలి వైకల్యం కారణంగా తలెత్తిన ఆత్మన్యూనతా భావాన్ని జయించేందుకు, ఆయన తనను తాను ఇంద్రజాలికుడిగా, రచయితగా మలుచుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి వద్ద ఈ విద్యను నేర్చుకున్నారు.
డాక్టర్ పట్టాభిరామ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. అలాగే ఇదే యూనివర్సిటీ నుంచి యోగా, హిప్నోటిజంలో పీహెచ్‌డీ చేశారు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ, గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికా నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టాలను అందుకున్నారు. భారత ఆహార సంస్థలో ఉద్యోగిగానూ పనిచేశారు.
Also Read: HYDERABAD: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం ఆ రోజు నుంచే స్టార్ట్
B.V. Pattabhiram: తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో ఆయన పలు మోటివేషనల్ పుస్తకాలు రాశారు. దూరదర్శన్‌లో అనేక మేజిక్ షోలు నిర్వహించారు. 1990లలో పలు పత్రికలలో ‘బాలలకు బంగారుబాట’ శీర్షికతో ప్రపంచ ప్రముఖుల జీవిత చరిత్రల గురించి, బాలజ్యోతి బాలల పత్రికలో ‘మాయావిజ్ఞానం’ పేరిట వ్యాసాలు రాసి లక్షలాది మంది విద్యార్థులు, యువతకు ప్రేరణగా నిలిచారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, జీవిత సవాళ్లను అధిగమించడానికి సానుకూల ఆలోచనలను రేకెత్తించడానికి ఆయన అహోరాత్రులు శ్రమించారు.
డాక్టర్ పట్టాభిరామ్ భౌతికకాయాన్ని బుధవారం (జూలై 2) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఖైరతాబాద్‌లోని ఆయన నివాసంలో అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. పలు పురస్కారాలను సైతం అందుకున్న డా. బీవీ పట్టాభిరామ్ మృతి పట్ల ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

