Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ స్థానిక జర్నలిస్టులు సోమవారం ఉదయం నిరసన ర్యాలీ నిర్వహించారు. పటాన్‌చెరు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటనా హక్కును హరించేందుకు దాడులకు తెగబడుతోందని తీవ్రంగా విమర్శించారు. నిన్న జరిగిన దాడి జర్నలిజంపై చేయబడిన దాడిగా పేర్కొన్నారు.
పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జర్నలిస్టులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, స్థానిక మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సంఘీభావంగా పలువురు ప్రజా ప్రతినిధులు, పౌరసంఘాలు సంఘీభావం తెలిపారు.