Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్టులో అదరగొట్టాడు. తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్‌లో తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడం ద్వారా మరపురాని ప్రదర్శన ఇచ్చాడు. అయితే ఫీల్డింగ్‌లో జైస్వాల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం 4 క్యాచ్‌లను వదులుకున్నాడు. జైస్వాల్ ఈ నాలుగు క్యాచ్‌లు పట్టి ఉంటే, ఈ మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. కానీ చివరికి, ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 2న ప్రారంభమవుతుంది. జైస్వాల్ ఈ మ్యాచ్‌లో పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
నలుగురి రికార్డులు బ్రేక్..
ఇంగ్లాండ్‌తో జరిగే రెండో మ్యాచ్‌లో అతను రెండు సిక్సర్లు కొడితే.. నలుగురు దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను అధిగమిస్తాడు. నిజానికి జైస్వాల్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో 40 సిక్సర్లు కొట్టాడు. రెండో టెస్టులో జైస్వాల్ మరో రెండు సిక్సర్లు కొడితే.. ఒకేసారి నలుగురు ఆటగాళ్లను అధిగమించడంలో విజయం సాధిస్తాడు. యశస్వి ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ వా, బంగ్లాదేశ్‌కు చెందిన తమీమ్ ఇక్బాల్, వెస్టిండీస్‌కు చెందిన డారెన్ బ్రావో, న్యూజిలాండ్‌కు చెందిన కల్లెన్ మున్రోలను అధిగమించే అవకాశం ఉంది. ఈ నలుగురు బ్యాట్స్‌మెన్ టెస్ట్ క్రికెట్‌లో ఒక్కొక్కరు 41 సిక్సర్లు కొట్టారు.
టెస్టుల్లో 5 సెంచరీలు..
2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జైస్వాల్, ఆ తర్వాత మంచి ప్రదర్శనలతో టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్, 10 అర్ధ సెంచరీలు, 5 సెంచరీలతో 1,903 పరుగులు చేశాడు.
ఇది కూడా చదవండి: IND vs ENG 2nd Test: రెండో టెస్టులో గెలవాలంటే.. ఈ నలుగురు కావాల్సిందే !
ఇంగ్లాండ్‌పై ప్రదర్శన
యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో బాగా రాణించాడు. ఇంగ్లాండ్‌తో మొత్తం 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్, 11 ఇన్నింగ్స్‌లలో 817 పరుగులు చేశాడు. అదేవిధంగా, జైస్వాల్ ఇంగ్లాండ్‌పై 2 డబుల్ సెంచరీలు సాధించాడు.
రెండో టెస్ట్ మ్యాచ్ కు జట్టు ప్రకటన
ఇదిలా ఉండగా, ఆతిథ్య ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మొదటి మ్యాచ్ తో పోలిస్తే ఇంగ్లాండ్ రెండో మ్యాచ్ కు ఒక ఆటగాడికి అవకాశం ఇచ్చింది. 15 మంది సభ్యుల జట్టులో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు లభించింది. దీనితో జోఫ్రా 2021 తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. రెండవ మ్యాచ్ కోసం జోఫ్రాకు ప్లేయింగ్ ఎలెవెన్‌లో అవకాశం లభించే అవకాశం ఉంది.