BRS Attack: మధ్యాహ్నం 1.45 – 1.50 గంటల సమయంలో మొదలైన దాడి. అంతా నిమిషాల్లో జరిగిపోయింది. పెద్ద పెద్ద సౌండ్లు. బండరాళ్లు మీద మీద పడుతున్నట్లుగా, అద్దాలు బద్దలు కొడుతున్నట్లుగా భారీ శబ్దాలు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలీక మహాన్యూస్ ప్రధాన కార్యాలయం రెండో అంతస్థులో ఉన్న ఉద్యోగులు, సబ్ ఎడిటర్లు, జర్నలిస్టులు షాక్‌కు గురయ్యారు. అప్పటికే కార్యలయం బయట ఉన్న కార్లను తుక్కు తుక్కు చేశాయి రౌడీ మూకలు. అందులో మహాన్యూస్ సీఈవో శివరామప్రసాద్, మహాభక్తి ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సైదాబాబుల కార్లను భారీ బండరాళ్లు పడేసి, ఇనుపరాడ్లతో బద్దలు కొట్టారు. ఒక్కసారిగి మీద పడ్డ ఉపద్రవానికి సెక్యూరిటీ గార్డులు సైతం భయాందోళనలకు గురై, ప్రాణభయంతో ఒణికిపోయారు. అక్కడి నుండి రౌడీ మూకలు కార్యాలయం రెండో అంతస్థుకు చేరుకునే ప్రయత్నం చేయగా.. మెయిన్ డోర్ క్లోజ్ చేశారు కార్యాలయంలోని సిబ్బంది.
డోర్‌కు అటువైపు నుండి దాదాపు ఆరేడుగురు డోర్‌ని బద్దలు కొట్టే ప్రయత్నం చేయగా… డోర్‌కు ఇటువైపు నుండి అంతే స్థాయిలో మహాన్యూస్ ఉద్యోగులు డోర్‌ని నొక్కిపట్టి బలంగా ప్రతిఘటించారు. అప్పటికే కార్యలయం అద్దాలు, కార్లు బద్దలయ్యాయి. ఆ మూకలు రెండో అంతస్థుకు చేరుకుని ఉంటే ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం జరిగినా ఆశ్చర్యం లేదు. డోర్‌ని అడ్డుకోవడంతో తిరిగి కార్యలయం బయటకు వెళ్లిన రౌడీ మూకలు రాళ్లను కార్యాలయంలోకి విసరడంతో రెండో అంతస్తులోని కంపూటర్లు కొన్ని పగిలాయి. ఆ బండరాళ్లు సిబ్బందికి తగిలి ఉంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఈ అరాచకరానికి మహాన్యూస్ చానల్‌లో విధుల్లో ఉన్న సుమారు 60, 70 మంది ప్రత్యక్ష సాక్షులుగా మిగిలారు. అందులో సగం మంది మహిళా ఉద్యోగులు, మహిళా యాంకర్లు, మహిళా జర్నలిస్టులే కావడం గమనార్హం.
ఇదంతా ఓ 8 నుండి 10 నిమిషాల్లో జరిగిన మెరుపు దాడి. దాడి జరిగిన విధానం చూస్తే… వచ్చింది కార్యకర్తల్లా లేరని, వారంతా ప్రాణాలు తీయాలన్నంత కసితో దాడికి పాల్పడటం చూస్తే ఖచ్చితంగా కార్యకర్తల ముసుగులో వచ్చిన కిరాయి మూకలని అర్థమవుతోంది. వారంతా కేటీఆర్ నినాదాలు చేస్తూ… కేటీఆర్ జోలికి వస్తే అంతు చూస్తాం అంటూ హెచ్చరిస్తూ, ఉన్మాదంతో ఊగిపోవడం చూసిన మహాన్యూస్ సిబ్బంది చాలా సేపటి వరకూ అలా షాక్‌లో ఉండిపోయారంటే… జరిగిన విధ్వంసం ఎలాంటిదో ఇంతకన్నా చెప్పక్కర్లేదు. గులాబీ కండువాలు వేసుకొచ్చిన వారు కేటీఆర్ నినాదాలు చేయడం చూస్తే.. ఈ దాడి ఆవేశంలో చేశారా? పక్కా ప్రణాళిక ప్రకారమే చేశారా? అన్నది తేలాల్సి ఉంది.