HARISH RAO: ‘‘పీపీటీ నాటకం.. కాలయాపన కోసం మాత్రమే!’’

HARISH RAO: బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు, కాంగ్రెస్ నేతలకు చూపించేందుకు చేసిన నాటకమని ఆయన విమర్శించారు. అసలు సమస్యలపై దృష్టి మళ్లించేందుకే ఇది ఉపయోగపడుతుందన్నారు.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, “సీఎం రేవంత్ మాటలు నమ్మడం అంటే ప్రజలను మోసం చేసినట్లే” అన్నారు. 2016లో జరిగిన బహుళ పక్షాల సమావేశానికి సంబంధించిన అజెండా మినిట్స్‌పై చర్చించేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన వ్యాఖ్యలతో ఎలాంటి ఒప్పందాలూ, ఏ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయాలూ తీసుకోలేదని గుర్తు చేశారు.

తెలంగాణ వాదనను బలంగా వినిపించండి
కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను ధైర్యంగా, నిశ్శబ్దంగా కాకుండా బలంగా వినిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతుల హక్కులను కాపాడే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు.

‘‘బేసిన్‌కు, బాసిన్‌కు తేడా తెలియని సీఎం!’”
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ తీవ్రంగా తప్పుబట్టారు. “బేసిన్‌కు, బాసిన్‌కు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడంటే…!” అంటూ ఎద్దేవా చేశారు. అసలు బీఆర్ఎస్ ఒత్తిడివల్లే ఎంపీలతో సమావేశం పెట్టారని ఆరోపించారు.

బీజేపీపై కూడా మండిపాటు
ఈ అంశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వైఖరిని కూడా హరీశ్ తప్పుబట్టారు. “చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు బీజేపీ నడుస్తోంది,” అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే జోక్యం చేసుకోవాలని, ప్రాజెక్టును తాత్కాలికంగా అయినా నిలిపివేయాలన్న డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టుకు వెళ్లే హెచ్చరిక
ప్రభుత్వం స్పందించకపోతే, బనకచర్ల ప్రాజెక్టు వల్ల నష్టపోయే రైతులతో కలిసి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ‘‘రైతుల పోరాటానికి మా పార్టీ అండగా ఉంటుంది. Telangana ప్రయోజనాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గం,’’ అని స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Narayanpet: నారాయణపేట జిల్లాలో యూరియా కష్టాలు: అన్నదాతల ఆవేదన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *