Mahesh kumar goud: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మరాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
“రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి సామాజిక న్యాయాన్ని నిజంగా అమలు చేస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే పథకాలను ప్రవేశపెట్టింది. దానికి ఉదాహరణగా హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా దళితబంధు పథకాన్ని హడావుడిగా ప్రకటించడం చెప్పవచ్చు,” అని మహేశ్ గౌడ్ విమర్శించారు.
కేవలం 18 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరగలేదని ఆయన పేర్కొన్నారు. “బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎన్నో విషయంలో వెనక్కి పోయింది. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ స్థాయిలో పరిపాలన జరిగినదే లేదని ప్రజలే అంటున్నారు,” అని గౌడ్ అభిప్రాయపడ్డారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కోణాలనూ పరిశీలిస్తోందని, పూర్తి వివరాలతో త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు ముందుండాలని ఆయన సూచించారు.
