PONGULETI SRINIVAS REDDY: తెలంగాణలో గత పది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా అవ్యవస్థితంగా మారిందని, ఇప్పుడు ఆ వ్యవస్థను శుద్ధి చేసి పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలు కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు భూ భారతి చట్టాన్ని రూపొందించి దశలవారీగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
భూ భారతి చట్టం అమలుతో రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించి 8.58 లక్షల దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. వాటిలో 3.27 లక్షల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్టు చెప్పారు.
ఖమ్మం (67 వేల), భద్రాద్రి కొత్తగూడెం (61 వేల), వరంగల్ (54 వేల), జయశంకర్ భూపాలపల్లి (48 వేల), నల్గొండ (42 వేల) జిల్లాల్లో అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. రెవెన్యూ అధికారులు రైతుల వద్దకు వెళ్లి, ఎలాంటి రుసుములు లేకుండా దరఖాస్తులు స్వీకరించారని, భూముల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.