RCB: అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC) T20 టోర్నమెంట్ 7వ మ్యాచ్‌లో సియాటిల్ ఓర్కాస్ అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ కొలిసియం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ – సియాటిల్ ఓర్కాస్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, సియాటిల్ ఓర్కాస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 9 పరుగులకే ఔటవ్వగా.. కైల్ మేయర్స్ డకౌట్ అయ్యాడు. దీని తర్వాత స్టీవ్ టేలర్(4) కూడా ఔటయ్యాడు.
ఇంతలో సియాటిల్ ఓర్కాస్ కెప్టెన్ హెన్రిక్ క్లాసెన్(0) తొలి షాక్ నుండి కోలుకోకముందే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సికందర్ రాజా 4 పరుగులు చేయగా, సుజిత్ నాయక్ 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఫలితంగా కేవలం 27 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆరోన్ జోన్స్ 17 బంతుల్లో 17 పరుగులు చేసి జట్టు మొత్తాన్ని 50 పరుగుల మార్కును దాటించాడు. చివరికి, సియాటిల్ ఓర్కాస్ మేజర్ లీగ్ క్రికెట్ 2025 టోర్నమెంట్‌లో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది, 60 పరుగులకే ఆలౌట్ అయింది. టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున జియా ఉల్ హక్, నంద్రే బర్గర్, నూర్ అహ్మద్ మెరిశారు.
RCB పేలవమైన రికార్డు:
ప్రపంచంలోని ప్రముఖ టీ20 లీగ్‌లో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత చెత్త రికార్డును కలిగి ఉంది. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు. ఇదిలా ఉండగా, మేజర్ లీగ్ క్రికెట్‌లో సియాటిల్ ఓర్కాస్ జట్టు 27 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి RCB రికార్డును బద్దలు కొడుతుందేమో అనిపించింది. కానీ చివరికి 60 పరుగులు చేయగలిగింది. దీనితో 8 ఏళ్ల క్రితం RCB దారుణమైన రికార్డు ఇప్పటికీ పేలవమైన రికార్డుగానే మిగిలిపోయింది.