Chevireddy Bhaskar Reddy Arrest: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇందులో కీలకంగా మారిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అర్ధరాత్రి అరెస్ట్ అయ్యారు. జూన్ 17 అర్ధరాత్రి సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీలంకకు పయనం… కానీ ముందే బ్రేక్!
బెంగళూరులోని ఎయిర్‌పోర్ట్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్లేందుకు చెవిరెడ్డి సన్నద్ధమవుతున్న సమయంలో ఆయనపై ఉన్న లుక్ అవుట్ నోటీసుల కారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసి ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏపీ పోలీసులు అక్కడికి చేరుకొని, చెవిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. అతనితో పాటు ప్రయాణించేందుకు సిద్ధమవుతున్న ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడినీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా చెవిరెడ్డి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై సిట్ అధికారులు ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఆయనను ఏ-38 నిందితుడిగా నమోదు చేశారు. అలాగే వెంకటేశ్ నాయుడు ఏ-34 నిందితుడిగా ఉన్నాడు. ఈ ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో, పోలీసులు ముందస్తు సమాచారంతో వారిని ఎయిర్‌పోర్ట్ వద్దే అడ్డుకున్నారు.
ఇది కూడా చదవండి: Mahaa Vamsi: మహా వంశీ సేతుబందాసనం
విజయవాడకు తరలింపు – ఏసీబీ కోర్టులో హాజరు
ఇద్దరినీ మూడు వాహనాల్లో కర్ణాటక పోలీసులు, ఏపీ సిట్ బృందం మంగళగిరికి తరలించింది. చెవిరెడ్డికి చెందిన పాస్‌పోర్ట్‌ను కూడా కర్ణాటక పోలీసులు ఏపీ అధికారులకు అప్పగించారు. బుధవారం ఉదయం వారిని విజయవాడకు తీసుకెళ్లి, అక్కడి సిట్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
ఇప్పటివరకు 9 మంది అరెస్ట్
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు సిట్ అధికారులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడుల అరెస్ట్ కీలకంగా మారింది. జగన్ కుటుంబానికి చెవిరెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన విషయం తెలిసిందే. దీంతో ఈ అరెస్టు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపే అవకాశముంది.