Amravati: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో విద్యుత్ సరఫరా అంతరాయం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎండలు మండిపోతున్న వేళ వాల్గావ్ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న స్థానిక యువకులు ఆగ్రహంతో అలజడి సృష్టించారు.
గత రాత్రి మొత్తం విద్యుత్ లేకపోవడంతో కోపంతో ఉడికిపోతున్న కొందరు యువకులు అమరావతి సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని… అక్కడి విద్యుత్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అంతేగాక, సబ్ స్టేషన్‌లోని టేబుల్‌కు నిప్పు పెట్టినట్లు సమాచారం.
అధిక ఉష్ణోగ్రతల నడుమ విద్యుత్ లేకపోవడం, నిరంతర సమస్యలపై తరచుగా ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించకపోవడంతోనే ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు స్థానికులు అంటున్నారు.
ఈ ఘటనపై స్పందించిన విద్యుత్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, దానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సంఘటనా ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలు మోహరించారు.