cm chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నగరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 2 నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 17 కార్పొరేషన్‌లను ప్లాస్టిక్ రహిత నగరాలుగా మారుస్తామని తెలిపారు. ప్లాస్టిక్‌కు బదులుగా గుడ్డ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై సమీక్ష నిర్వహించిన సీఎం, 87 పట్టణాల్లో 157 ఆర్ఆర్ఆర్ (Reduce, Reuse, Recycle) కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 90 రోజుల్లో వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
అత్యుత్తమ పనితీరు చూపిన సంస్థలకు ‘స్వచ్ఛత అవార్డులు’ అందజేయాలని నిర్ణయించారు. అలాగే రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీని రూపొందించి, విశాఖలో 400 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కు ఏర్పాటు చేయాలని వెల్లడించారు. వేస్ట్ టు ఎనర్జీ, రీసైక్లింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. 11 కీలక రంగాలపై ప్రత్యేక దృష్టితో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.