SIT Counter: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా, తనను సిట్ అధికారులు వేధించారని, తప్పుడు వాంగ్మూలం ఇవ్వమని ఒత్తిడి చేశారని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్‌రెడ్డి డీజీపీకి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. అయితే, మదన్‌రెడ్డి చేసిన ఆరోపణలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు తీవ్రంగా ఖండించారు. ‘సత్యమేవ జయతే’ అంటూ కీలక ప్రకటన విడుదల చేశారు. మదన్‌రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశాడని సిట్ అధికారులు స్పష్టం చేశారు. పోలీసులు తనను వేధించారని, విచారణలో సిట్ అధికారులు కొట్టారని మదన్‌రెడ్డి చేసిన ఆరోపణలు అబద్ధమని తేల్చిచెప్పారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని, దానిని బహిర్గతం చేస్తామని సిట్ అధికారులు అన్నారు.
మద్యం కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని సిట్ అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పర్సనల్ గన్ మెన్‌గా పనిచేసిన మదన్‌రెడ్డిని విచారణకు పిలిచామని, అయితే అతను విచారణకు సహకరించలేదని వెల్లడించారు. అంతేకాకుండా, తమ అధికారులనే “మా పేర్లు రాసి చనిపోతాను” అని మదన్‌రెడ్డి బెదిరించినట్లు సిట్ పేర్కొంది. దర్యాప్తులో కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్లు తెలిసిందని సిట్ అధికారులు తెలిపారు. ఈ నగదును ఎన్నికల సమయంలో ప్రజలకు పంచినట్లు తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.
Also Read: minister satya kumar : ఆరోగ్య శాఖలో 6 వేల కోట్ల అప్పులు
SIT Counter: లిక్కర్ స్కామ్‌ను మొదటి నుంచీ పారదర్శకంగా, నిబద్ధతతో విచారిస్తున్నామని సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు దాదాపు 200 మందికి నోటీసులు ఇచ్చి విచారించామని, అయితే ఎవరూ తమపై ఎటువంటి ఆరోపణలు చేయలేదని చెప్పారు. మదన్‌రెడ్డి డ్రామాలను కొన్ని ఛానెల్స్‌లో వైరల్ చేయడం వెనుక కుట్ర ఉందని తమకు బలమైన నమ్మకం ఉందని సిట్ అభిప్రాయపడింది.
చెవిరెడ్డి అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్‌ను సిట్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలు పచ్చి అబద్ధమని సిట్ అధికారులు కొట్టిపారేశారు. ఈ సంఘటనలు చూస్తుంటే, సిట్ దర్యాప్తుపై ఒత్తిడి తెచ్చి విచారణను బలహీన పరచాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ స్కాంలో దోషులు ఎంతటివారైనా సరే, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చట్టం ముందు నిలబెడతామని సిట్ అధికారులు స్పష్టం చేశారు. మదన్‌రెడ్డి ఆరోపణలపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరపాలని, తప్పు ఎవరిదైనా కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ కోరింది.