Seetakka : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాష్ట్ర మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, “జైలుకు వెళ్లాలన్నదే ఆయనకు ఆసక్తిగా కనిపిస్తోంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కేటీఆర్ రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తనను వీలైనంత త్వరగా జైలుకు పంపాలని ఉద్దేశమేమోనని ఆమె ఎద్దేవా చేశారు. “కవిత జైలుకు వెళ్లొచ్చి బీసీ ఎజెండా చేపట్టింది. కేటీఆర్ మాత్రం తనక్కూడా ఏదైనా మంత్రధ్వజంగా ప్రకటించాలంటే జైలు అనుభవం అవసరమని భావిస్తున్నట్టున్నారు” అని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ మాటల్లో పొగరు తళుక్కుమంటోందని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ” తోడేళ్లలా దోచుకుని, ఇప్పుడు వినయంగా నటిస్తున్నారు. ఒకవైపు కేటీఆర్ పొగరుగా మాట్లాడుతుంటే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పౌరుషంతో స్పందిస్తున్నారు” అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు.
ఇక, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో భాగంగా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్లేముందు ట్వీట్ చేసిన ఆయన, ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, ముప్పైసార్లు పిలిచినా హాజరవుతానని పేర్కొన్నారు. తనను ఏసీబీ విచారణకు పిలవడం వల్ల కొందరికి “రాక్షసానందం” కలుగుతోందని, అవసరమైతే అరెస్టు చేయొచ్చని కూడా సవాల్ విసిరారు.
జైలు, కేసులు తనకు కొత్త కాదని, ఉద్యమకాలంలో జైలుకు వెళ్లి వచ్చానని కేటీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపైనే మంత్రి సీతక్క స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.