Chevireddy Workings

Chevireddy Workings: పోలీసులపై దౌర్జన్యంలో ఇది నెక్ట్స్‌ లెవెల్‌!

Chevireddy Workings: సీఐని నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఏక వచనంతో మాట్లాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే గత వైసీపీ రూలింగ్‌లో ఒక మాజీ ఎమ్మెల్యే ఇదే తరహాలో ప్రవర్తించి ఉంటే సీన్‌ వేరేలా ఉండేది. వెంటనే అతని అదుపులోకి తీసుకొని, రాత్రంతా స్టేషన్‌లో నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించి బయటకు పంపేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో సిచ్యువేషన్‌ అలా లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం చంద్రబాబు నింపాదిగా కామన్‌ డైలాగ్‌ ఒకటి చెబుతున్నారు. ఈ మెతక వైఖరే రాష్ట్రంలో వైసీపీ నేతలకు వరంలా మారిందన్న అభిప్రాయాలున్నాయి.

దమ్ముంటే అరెస్ట్ చేసుకోమంటూ ఆర్కే రోజా, అంబాటి రాంబాబు, పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి వాళ్లు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. వీరందరి పైన కూడా అక్రమ సంపాదన కేసులు ఇప్పటికీ ఉన్నప్పటికీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరితో వేచి చూస్తోందో ప్రజలకు అంతు పట్టడం లేదు. రోజాపై ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగం కేసు, భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీఆర్ బాండ్లలో అవకతవకల కేసు, టీటీడీ నిధుల దుర్వినియోగం కేసు, పేర్ని నాని శ్రీమతిపై రేషన్‌ బియ్యం మాయం చేసిన కేసు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై లిక్కర్‌ స్కామ్‌ కేసు ఉన్నాయి. కానీ వీరు స్వైర విహారం చేయటాన్ని మాత్రం ఆ కేసులు, విచారణలు అడ్డుకోలేకపోతున్నాయి.

Also Read: Census 2027: 2027 మార్చి ఒకటి నుంచి జనగణన..

Chevireddy Workings: పోలీసులను సైతం బెదిరించే స్థాయికి చేరుకున్న వైసీపీ నాయకులు.. అదేదో తమ హీరోయిజంగా భావిస్తున్నారు. సీదిరి అప్పలరాజు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకూ, వారి బెదిరింపులు, హడావుడి దృశ్యాలను కెమెరాలతో రికార్డ్ చేయించి, స్వయంగా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని సవాల్ విసురుతున్నారు. పొదిలి పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన రచ్చ వీడియో కూడా అదే మాదిరి వైరల్‌ అయింది. చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి, ప్రకాశం జిల్లాలో వైసీపీ కార్యకర్తలకు మద్దతుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, సీఐని ఏకవచనంతో బెదిరించారు. ఆశ్చర్యకరంగా, పోలీసులు ఆయనను గౌరవంగా బయటకు పంపారు.

చెవిరెడ్డి గత ఎన్నికల సమయంలో పోలింగ్ ఆఫీసర్‌ను బెదిరించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం చేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా, ఆయనపై ఎలాంటి కఠిన చర్యలూ లేవు. ఒకప్పుడు అంతంత మాత్రం ఆర్థిక స్థితిలో ఉన్న చెవిరెడ్డి, ఇప్పుడు వైసీపీలో వందల కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి చేరుకున్నారు. అక్రమ ఆస్తులపై ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన ధైర్యంగా అధికారులను బెదిరిస్తున్నారు. ఎలాంటి బెరుకు లేకుండా ఇలా స్వైర విహారం చేస్తుండటానికి కారణం ప్రభుత్వ మెతక వైఖరేనని కార్యకర్తలు భావిస్తున్నారు. చెవిరెడ్డి లాంటి నాయకులను కట్టడి చేయకుంటే.. శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. కొందరినే అరెస్టు చేస్తున్నారు, మరి కొందరితో కుమ్మక్కవుతున్నారని కనుక ప్రజలు భావిస్తే.. ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లే అవకాశం లేకపోలేదు. పొదిలి ఘటనలో వాస్తవాలను వెలికి తీసిన పోలీసులు, చెవిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *