Hyderabad: ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్న కాఫీ షాపుల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్‌ల వరకు అనేక ప్రదేశాల్లో ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉంది. ఫ్రీగా ఇంటర్నెట్ దొరుకుతుందనే ఉద్దేశంతో చాలా మంది ప్రజలు సరదాగా వాటిని వాడేస్తున్నారు. అయితే ఇలా జాగ్రత్తలు లేకుండా ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించడం ప్రమాదకరం అని తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.
హ్యాకర్లు ఆకర్షణీయమైన పేర్లతో ఫ్రీ హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసి, వాటిని ఉపయోగించే వారిపై పర్యవేక్షణ ఏర్పాటు చేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఇలా వాడిన ఫ్రీ నెట్‌వర్క్ ద్వారా హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం, లాగిన్ డేటా, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి సున్నితమైన సమాచారం దొంగిలించగలరని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌లు వాడేటప్పుడు ఆన్‌లైన్ పేమెంట్లు చేయరాదని, వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడా నమోదు చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన అవగాహన వీడియోలో ఫ్రీ వైఫై వాడకంతో ఎదురయ్యే ముప్పులను ప్రజలకు వివరించారు.
జనం తమ డేటా భద్రతను కాపాడుకోవాలంటే, గుర్తు తెలియని నెట్‌వర్క్‌లను వినియోగించకుండా జాగ్రత్త వహించాలన్నారు. అవసరమైతే మాత్రమే ఫ్రీ వైఫై ఉపయోగించాలి, అది కూడా అత్యంత జాగ్రత్తతోనే వినియోగించాల్సిన అవసరం ఉందని తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరిస్తోది.