Krishanma Raju Remand Report: ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ సాక్షి టీవీ చర్చలో మహిళలను కించపరిచేలా హేయంగా మాట్లాడిన 62 ఏళ్ల సీనియర్ పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజుపై మంగళగిరి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 38 ఏళ్ల పాత్రికేయ అనుభవం ఉన్న ఆయనకు న్యాయాధికారి సురేష్‌బాబు సూటి ప్రశ్నలు సంధించారు. “మహిళలపై ఇంత దారుణంగా మాట్లాడే స్థాయికి దిగజారిన మీది జర్నలిజమా? ఏ ఆధారంతో ఈ వ్యాఖ్యలు చేశారు? మీ మాటలు తప్పని అనిపించలేదా?” అని నిలదీశారు. కృష్ణంరాజు మౌనంతో సమాధానాలు దాటవేశారు.
గురువారం తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును మంగళగిరి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయాధికారి, ఈ నెల 26 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశించారు. అనంతరం ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కోర్టులో వాదనల సందర్భంగా కృష్ణంరాజు తప్పులను న్యాయాధికారి ఎత్తిచూపారు. “పత్రికా కథనాలు చూసి మాట్లాడాను” అన్న కృష్ణంరాజు వాదనను తోసిపుచ్చిన న్యాయాధికారి, “మీరు సంఘ సంస్కర్తా? ఏది మాట్లాడాలో తెలియదా?” అని ప్రశ్నించారు. భావప్రకటన స్వేచ్ఛకు హద్దులున్నాయని, జర్నలిస్ట్‌గా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మినహాయింపు లేదని హెచ్చరించారు.
ఇక కృష్ణంరాజు రిమాండ్ రిపోర్టు సంచలన విషయాలను వెల్లడించింది. కృష్ణంరాజు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం చెందకపోగా, వాటిని సమర్థిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు విడుదల చేశారని పోలీసులు తెలిపారు. అమరావతిలో వివిధ వర్గాలు, కులాలు, మతాల వారు నివసిస్తున్న విషయం ఆయనకు తెలిసినా… దళిత, గిరిజన మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచాలనే దురుద్దేశంతోనే ఆయన అలా మాట్లాడారని ఆరోపించారు. హైకోర్టు న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని తెలిసినా, పూర్తి స్ఫృహతోనే ఆ వ్యాఖ్యలు చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కృష్ణంరాజు వెనుక ఉన్న శక్తులపై… ప్రాథమిక దర్యాప్తు వివరాలను కూడా కోర్టుకు సమర్పించారు పోలీసులు.
Also Read: KTR: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్పై కేసు నమోదు..
Krishanma Raju Remand Report: న్యాయాధికారి ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడమో, లేక మౌనంగా ఉండిపోవడమో చేసిన కృష్ణం రాజు.. తనని అరెస్ట్ చేసిన పోలీసుల పనితీరును “ఎక్సలెంట్” అంటూ సర్టిఫికెట్ ఇవ్వడంపై న్యాయాధికారి మండిపడ్డారు. పోలీసుల పనితీరుపై సర్టిఫికెట్ ఇవ్వమని మిమ్మల్ని అడగలేదనీ, అడిగిన వాటికి సమాధానం చెబితే చాలని కాస్త గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. కోర్టు విచారణ అంటే.. సాక్షి డిబేట్ అనుకున్నారేమో తెలీదు కానీ.. “ఈ ఓవరాక్షనే.. తగ్గించుకుంటే మంచిది” అన్న తరహాలో న్యాయాధికారి చేతిలో చీవాట్లు తినడం కొసమెరుపు. మొత్తానికి ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.