Nara lokesh: తల్లికి వందనం పథకానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు అమలు చేసిందో, అదే నిబంధనలు ప్రస్తుతం తాము కూడా పాటిస్తున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కాబట్టి ఈ పథకం అమలుపై వైసీపీ నేతలకు ఏ విధంగా ప్రశ్నించే నైతిక హక్కు ఉందని ఆయన ప్రశ్నించారు.
‘‘బాబు సూపర్ సిక్స్’’ హామీలలో భాగంగా ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మొత్తం రూ. 8,745 కోట్లను జమ చేసినట్లు లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
వైసీపీ పాలనలో తప్పులు – లోకేశ్ విమర్శ
గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలను తాము అనుసరిస్తున్నప్పటికీ వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరైంది కాదని లోకేశ్ విమర్శించారు. ‘‘గత విద్యాశాఖ మంత్రికి కనీస విద్యా వ్యవస్థపై కూడా అవగాహన లేదు. యూడైస్ డేటాలో ప్రీ ప్రైమరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల వివరాలు కలిపి తప్పుడు లెక్కలు చూపారు’’ అని ఆరోపించారు.
అర్హులకు న్యాయం – పారదర్శక పంపిణీ
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ హామీ ఇచ్చారు. 1వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల్లో చేరిన తర్వాత వారి తల్లుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. తల్లి లేని పిల్లల విషయంలో తండ్రి లేదా సంరక్షకుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నామని, అనాథాశ్రమాల్లో ఉంటున్న విద్యార్థుల కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా నిధులు అందజేస్తామని వివరించారు.
పథకం అమలులో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని, అనవసర విమర్శలు చేయకుండా ప్రతిపక్షం ఆత్మపరిశీలన చేసుకోవాలని లోకేశ్ సూచించారు.