Pakistan: దీపావళి సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ-ఎన్సీఆర్ల వాతావరణం విషపూరితం అవుతుంది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న అనేక ప్రాంతాల్లో కాలుష్య స్థాయి పెరిగి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. గత కొన్నేళ్లుగా ఈసారి కూడా అదే జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని రెండు పెద్ద నగరాలు నోయిడా – ఘజియాబాద్ల గాలి బాగా కలుషితం అయిపొయింది. ఇక్కడ AQI స్థాయి 300 మించి ఉంది. ఈ నగరాల్లో కాలుష్యం ఎందుకు పెరుగుతుందో యూపీ ప్రభుత్వం చెప్పింది. దీనికి కారణం పాకిస్తాన్ అని అంటోంది. ఎందుకంటే, బోర్డర్ లో పాకిస్తాన్ రైతులు పంటపొలాల్లో చెత్తను కాలుస్తుంటే వెలువడుతున్న పొగ కారణంగా కాలుష్యం పెరిగిపోతోంది.
నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ మూడు నగరాలు ఒకే రోజులో చాలా తక్కువ గాలి నాణ్యతను చూడటం ఈ సంవత్సరం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ బోర్డర్ లో కాలుస్తున్న వ్యవసాయ చెత్త నుంచి వస్తున్న దట్టమైన, విషపూరితమైన పొగ ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్‌ను ముంచేస్తోంది. దీపావళి తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
యూపీ ప్రభుత్వం కాలుష్యానికి పాకిస్థాన్‌ను వేలెత్తి చూపడానికి కచ్చితమైన కారణం ఉంది. నోయిడా-ఘజియాబాద్‌లో AQI 300 దాటితే, పాకిస్థాన్ నగరం లాహోర్‌లో సోమవారం నాటికి 700 దాటింది. ఆరోగ్యకరమైన గాలి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఇది దాదాపు 65 రెట్లు ఎక్కువ. లాహోర్ భారత సరిహద్దు నుండి 25 కి.మీ దూరంలో మాత్రమే ఉండడం గమనార్హం.