Fish Prasadam 2025: తెలుగు సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మృగశిర కార్తె రాబోతున్న వేళ, హైదరాబాద్‌లో మరోసారి బత్తిన బంధువుల చేప ప్రసాదం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ రోజున సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. వాతావరణం చల్లబడి, వర్షాలు మొదలయ్యే ఈ కాలంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. అయితే, మృగశిర కార్తె అనగానే ప్రజల మదిలోకి వెంటనే వచ్చే పేరే చేప మందు.
ఇది కేవలం ఓ మతపరమైన సంప్రదాయమే కాకుండా, ఆరోగ్యకర ప్రయోజనాల కోసం వేలాది మంది నమ్మి వచ్చే ఘటన. ఆస్తమా, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యల నివారణకు బత్తిన కుటుంబం సిద్ధం చేసిన చేప ప్రసాదం కు ప్రజల నుండి భారీ స్పందన లభిస్తోంది. ఈ మందులో కొర్రమీను చేపలు, బెల్లం, రహస్య హర్బల్ మిశ్రమం ఉంటుందని చెబుతున్నారు. సుమారు 170 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Cm revanth: ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ – దత్తాత్రేయ జీవితాన్ని ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ సంవత్సరం జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. జనసందోహాన్ని దృష్టిలో పెట్టుకుని GHMC, పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టాయి. రోగులకు తాగునీరు, భోజనం, విశ్రాంతి ప్రాంతాలు, వైద్య సాయం వంటి అవసరాలన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికోసం ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తున్నారు.
చేప ప్రసాదం అందుకోవాలంటే ముందుగా కొర్రమీను చేపపిల్లలను కొనుగోలు చేయాలి. రోగులు ఒకటి రెండు రోజుల ముందుగానే హైదరాబాద్‌కు చేరుకొని క్యూ లో నిలబడతారు. మొదట్లో ఈ ప్రక్రియ పాతబస్తీలో ఉండేది. భద్రతా కారణాల వల్ల ప్రస్తుతం నాంపల్లి గ్రౌండ్ కు తరలించబడింది.
ఆధ్యాత్మిక నమ్మకాలు, ప్రజల విశ్వాసం, ఆరోగ్యసంధానమైన సంప్రదాయం ఇవన్నీ కలిసి మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌ను ఒక ప్రత్యేక కేంద్రంగా మార్చాయి. భక్తితో, ఆశతో వస్తున్న వారికి ఈ చేప మందు ఉపశమనం కలిగించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.