Rahul Gandhi: 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికలను రిగ్ చేసిందని, అదే తరహాలో రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం జరుగుతుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేస్తూ, తాను రాసిన ఒక వ్యాసాన్ని కూడా జత చేశారు.
“ఎన్నికలను ఎలా రిగ్ చేయాలి? మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించిన పాఠపుస్తకంగా మారాయి. దశల వారీగా ఎలా జరిగిందో నేను రాసిన వ్యాసం చెబుతుంది” అని రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ Five-Step Rigging Plan అంటూ ఇలా వివరించారు:
1. ఎన్నికల కమిషన్‌ను నియమించే కమిటీని ముందుగా నియంత్రిస్తారు.
2. నకిలీ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చుతారు.
3. ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచుతారు.
4. బీజేపీ గెలవాల్సిన నియోజకవర్గాల్లో బోగస్ ఓటింగ్‌కు దారిచొంటారు.
5. అన్ని రుజువులను అణిచేస్తారు.
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. “ఇలాంటి రిగ్గింగ్ మోసం చేసే జట్టుకు గెలుపు తీసుకొస్తుంది కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచి, ప్రజల విశ్వాసాన్ని నాశనం చేస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రతి బాధ్యత గల భారతీయ పౌరుడు సత్యం కోసం ప్రశ్నించాలి అని రాహుల్ పిలుపునిచ్చారు.
“సాక్ష్యాలను చూసేటప్పుడు, వాటి వెనుక ఉన్న పరిస్థితులను స్వయంగా విశ్లేషించండి. ప్రజాస్వామ్యం మనందరిది – దాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే” అని ఆయన హితవు పలికారు.