Gutka: మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుట్కా, పాన్ మసాలా అమ్మకాలు, తయారీపై గుట్కా, పాన్ మసాలాపై నిషేదాన్ని మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొగాకు లేదా నికోటిన్‌తో తయారు చేసే గుట్కా, పాన్ మసాలా వంటి వాటిని తయారు చేసినా, అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా నేరంగా ప్రభుత్వం పరిగణించనుంది.
నవంబర్ 7వ తేదీ నుండి నిషేద ఆదేశాలు అమలు కానున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఫుడ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 30 స్టాండర్డ్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ ఆదేశాలలో పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలోనే గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. గుట్కా, పాన్ మాసాలలో ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు, నికోటిన్ ఉండడం మూలంగానే వాటిని నిషేధించినట్లు పేర్కొన్నారు. గుట్కాను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు
.