Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఒక రోజు ముందే పేదల కోసం సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలతో పంచుకున్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ,
“మా ప్రభుత్వం పేదల కోసం పని చేసే ప్రభుత్వం. పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం,” అని చెప్పారు.
ఆయన వివరించగా, రాష్ట్రంలో 64 లక్షల మందికి నెల మొదటి తేదీ నుంచే పెన్షన్లు అందుతున్నాయని, ఇప్పటికే 90 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయిందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పేదలకు వారి పని చేసే చోటే పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజలకు అసౌకర్యం లేకుండా ఉండేందుకు తీసుకున్న ముఖ్యమైన చర్యగా పేర్కొన్నారు.
ఉద్యోగులకు జీతాలిలా పేదలకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు.
తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, పెన్షన్లు పెంచుతామన్న మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా ఇప్పటివరకు రూ.34 వేల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేసినట్టు వెల్లడించారు.
ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ల పంపిణీ దేశంలో ఎక్కడా జరగడం లేదని అన్నారు. ప్రజల సౌలభ్యం కోసం మూడు నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించామని చంద్రబాబు తెలిపారు.