Akhil Akkineni Wedding: టాలీవుడ్ లో మరోసారి అక్కినేని కుటుంబం శుభవార్తతో వార్తల్లోకి వచ్చింది. స్టార్ హీరో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌జీ కుమార్తె జైనబ్ తో గత సంవత్సరం నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న అఖిల్… ఇప్పుడు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు.
అఖిల్ – జైనబ్ పెళ్లి జూన్ 6న జరగనున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో బలమైన సమాచారం హల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అఖిల్ వివాహ శుభలేఖను స్వయంగా నాగార్జున, అమల దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందజేశారు. శుక్రవారం (మే 31) ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన అక్కినేని దంపతులు, సీఎంను మర్యాదపూర్వకంగా కలవడం, పెళ్లికి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సీఎం అఖిల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అఖిల్ వివాహ వేడుక ఎక్కడ జరగబోతుందో కూడా ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. గతేడాది నాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల పెళ్లిలా, అఖిల్ – జైనబ్ పెళ్లీ కూడా హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలోనే సాదాసీదాగా జరగనుందని సమాచారం. ఇప్పటికే పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు ఊపందుకున్నాయి.
ఇది కూడా చదవండి: Harihara veeramallu: వీరమల్లు టికెట్ రేట్ల జోరు: తెలంగాణలో గ్రీన్ సిగ్నల్, ఏపీలో భారీ పెంపు!
ఇక అఖిల్ సినిమా ప్రయాణంపై వస్తే, ఆయన బాలనటుడిగా ‘సిసింద్రీ’తో వెండితెరపై పరిచయమై, ‘అఖిల్’ సినిమాతో హీరోగా మారాడు. హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించినా అతనికి సరైన హిట్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కిషోర్ అబ్బూరూ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే… గతంలో ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ప్రభుత్వం – నాగార్జున మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చిన నేపథ్యంలో, ప్రస్తుతం నాగార్జున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. త్వరలోనే అఖిల్ పెళ్లిపై పూర్తి వివరాలు, ఫోటోలు బయటకు రావనున్నాయి. టాలీవుడ్‌లో ఈ శుభవార్తతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి!


