YS Jagan Fan: తూర్పుగోదావరి జిల్లా, చాగల్లు మండలం, ఊనగట్ల గ్రామం – ఇటీవల సోషల్‌మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి అరగుండు గీయించుకుని గ్రామం చుట్టూ తిరుగుతూ కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తి పేరు వీరవల్లి శివ, వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరాభిమాని. విషయం లోతుగా తెలిసిన తరువాత అతని చర్య వెనుక ఉన్న భావోద్వేగాల్ని అర్థం చేసుకోవచ్చు.
వివరాల్లోకి వెళ్తే – శివ, కొవ్వూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కన్వీనర్‌గా పని చేశాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ గెలుస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్న శివ, తన స్నేహితులతో ఓ మాట ఇచ్చాడు. జగన్ ఓడిపోతే తాను అరగుండు గీయించుకుంటానని పందెం వేసాడు.
అయితే, ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టింది. అప్పటి నుంచి శివ మౌనంగా ఉన్నాడు. గడిచిన ఏడాది కాలంలో పలుమార్లు స్నేహితులు అతన్ని అడిగినా, స్పందించలేదు. చివరకు, మాట నిలబెట్టుకోవాలనే సంకల్పంతో, ఈనెల 25వ తేదీన (ఆదివారం) శివ అరగుండు గీయించుకుని ఊనగట్ల సెంటర్లో తిరిగాడు. ఈ వీడియోను తన స్నేహితులకు పంపడంతో పాటు సోషల్‌మీడియాలో కూడా షేర్ చేశాడు. వెంటనే వైరల్ అయింది.
ఈ ఘటనపై శివ విడుదల చేసిన వీడియోలో చెప్పిన మాటలు మరింత భావోద్వేగంగా మారాయి –
“నేను నమ్మిన నాయకుడు జగన్. ప్రజలు ఆయనను గెలిపిస్తారని నమ్మాను. కానీ ప్రజల తీర్పు వేరుగా వచ్చింది. కానీ నేను ఇచ్చిన మాటకు కట్టుబడి అరగుండు గీయించుకున్నాను. మాట నిలబెట్టుకోవడం వల్ల వచ్చిన కిక్ వేరే స్థాయిలో ఉంది” అని పేర్కొన్నాడు.
అతని వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. మాటంటే మాటే అనే నమ్మకాన్ని ప్రజల్లోకి తేవడంలో శివ చర్య ఒక చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నమ్మకాలు ఎంత లోతుగా ప్రభావం చూపిస్తాయో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

