Chandrababu : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండో రోజున ఈ ఎన్నిక జరిగింది. పార్టీ ఎన్నికల అధికారి వర్ల రామయ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అనంతరం మహానాడు వేదికపై చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, రాష్ట్రాభివృద్ధి మరియు ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను పురోగతిపథంలో నడిపించడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
చంద్రబాబు తన ప్రసంగంలో, పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. సముద్రంలోకి వృథా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకూ ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్ అనవసర విమర్శలు చేస్తోందని ఆయన విమర్శించారు. గోదావరి నదిపై తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులపై తాము ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆయన గుర్తు చేశారు.
పోలవరం నుంచి కృష్ణా నదికి, అక్కడినుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు, చివరకు బనకచర్ల వరకు నీటిని తరలించే భారీ ప్రణాళికను ఆయన వివరించారు.