Naidu Big Plan For AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీ పర్యటనలో పలు కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందుంచారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలలో పరిశ్రమల స్థాపనకు విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను ఆయన విన్నవించారు. లేపాక్షి-మడకశిర మధ్య అందుబాటులో ఉన్న 10 వేల ఎకరాల్లో సైనిక, పౌర విమానాల తయారీ, రక్షణ రంగ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ఏరోస్పేస్ ఎకో సిస్టం ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రంలోని NDA సర్కారులో కీలక భాగస్వామి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారతీయ రక్షణ తయారీ రంగాన్ని.. రాష్టానికి ఆకర్షించేందుకు ప్రణాళికలతో కూడిన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA), లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (LCA) తయారీ ఉత్పత్తిని కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇందు కోసం కేంద్రంలోని మంత్రులతో కీలక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా లేపాక్షి, డొనకొండ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతిలో భారత రక్షణ పారిశ్రామిక హబ్‌లను అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం సూచించారు. ఈ ప్రతిపాదన ద్వారా ఏపీ.. భారత రక్షణ తయారీకి కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: RSS Chief Mohan Bhagwat: శక్తివంతంగా ఉండటం తప్ప మనకు వేరే మార్గం లేదు..
Naidu Big Plan For AP: నంబర్ 1. AMCA కారిడార్. లేపాక్షి మడకసిర హబ్‌లో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ ఉత్పత్తి సౌకర్యం కోసం 10,000 ఎకరాల భూమి సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రులకు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ ఏరియా నుంచి బెంగళూరు విమానాశ్రయానికి ఒక గంటలోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తికి హిందూస్తాన్ ఏరోనాటికల్ సంస్థకి అవసరమైన భూమిని అందించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతిపాదించిన 5 హబ్‌లలో ఇదే అతిపెద్దదని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు విలువ రూ.వేల కోట్లలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. AMCA భారతదేశంలోని ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ ఇతర ప్రైవేట్ సంస్థలతో కలిసి దీనిని అభివృద్ధి చేసి, తయారు చేస్తోంది.
నంబర్ 2. దొనకొండలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్. దీని కోసం జగ్గయ్యపేట-డొనకొండ హబ్‌లో 6 వేల ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతంలో ఆపరేషనల్ ఎయిర్ బేస్, లాజిస్టిక్స్ సెంటర్, శిక్షణ సౌకర్యం, మరియు ఆర్&డీ హబ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు సీఎం చంద్రబాబు. ఇందులో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం ఆపరేషనల్ ఎయిర్ బేస్, లాజిస్టిక్స్ సెంటర్, శిక్షణ సౌకర్యం, పరిశోధన, అభివృద్ధి హబ్‌ను చంద్రబాబు ప్రతిపాదించారు.
నంబర్ 3. విశాఖ-అనకాపల్లి నావల్ హబ్. 3,000 ఎకరాలకు పైగా ప్రతిపాదించబడిన విశాఖపట్నం-అనకాపల్లి హబ్‌ను నావల్ ఎక్విప్‌మెంట్, వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ కోసం ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు నావల్ కమాండ్ మరియు నేషనల్ అడ్వాన్స్‌డ్ ఆఫ్‌షోర్ బేస్‌కు మద్దతుగా సముద్రతీర భూభాగాన్ని మెరైన్, అండర్ వాటర్ సెజ్‌గా ప్రకటించాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు.
Also Read: Chandrababu New House: కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం..!
Naidu Big Plan For AP: నంబర్ 4. కర్నూల్-ఓర్వకల్ డ్రోన్ అండ్ డిఫెన్స్ హబ్. 4,000 ఎకరాల్లో కర్నూలు-ఓర్వకల్ వద్ద మిలిటరీ డ్రోన్, రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ కాంపోనెంట్ తయారీ కోసం నాల్గవ హబ్‌ను ప్రతిపాదించారు సీఎం చంద్రబాబు నాయుడు.
ఇక నంబర్ 5. తిరుపతిలో భారత రక్షణ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి కోసం ఐదవ హబ్ ప్రతిపాదిస్తున్నారు చంద్రబాబు.
ఈ ఐదు హబ్‌ల ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం.. దేశీయంగా ఢిఫెన్స్ ఏరోస్పేస్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే అని కూడా చంద్రబాబు తెలిపారు. అలాగే దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గించవచ్చని, ఎగుమతులు పెంచవచ్చని కేంద్రానికి వివరించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు… హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్‌లను కలిశారు. ప్రతిపాదిత ఐదు హబ్‌లతో పాటూ… ఆంధ్రప్రదేశ్‌లో ఆర్మీ కంటోన్మెంట్ ఏర్పాటు చేయాలని, కొత్తగా సైనిక్ స్కూళ్లు ఇవ్వాలని, తిరుపతి ఐఐటీలో DRDO సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.