Mahanadu Lokesh Mark: కాలం మారుతోంది.. ప్రజల అవసరాలు మారుతున్నాయి.. వారి ఆలోచన విధానం కూడా మారుతోంది. మార్పు నిత్య నూతనం అని నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం నినాదం నియంతృత్వాన్ని తరిమేసింది. చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదం తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది వేసింది. ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజలకు.. పార్టీకి.. కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందించాల్సిన తరుణం ఆసన్నమైందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నారా లోకేష్ ఆరు కీలక అంశాలను కడప మహానాడులో ప్రతిపాదించబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ ఆశయాలు.. చంద్రబాబు ఆలోచనలతో పాటు.. భవిష్యత్తుకు అవసరమయ్యే కొన్ని కీలక అంశాలను ప్రతిపాదించే ప్రక్రియలో భాగంగా కొన్ని వర్గాలకు పెద్ద పీట వేసేందుకు లోకేష్ నడుం బిగిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలు, రైతులు, యువత, సామాజిక న్యాయం, కార్యకర్తల సంక్షేమం వంటి అంశాలపై ఫోకస్ పెట్టి లోకేష్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీంట్లో భాగంగా తెలుగు కుటుంబాలు ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉండేందుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో తనదైన స్టైల్లో ఓ ఐడియాలజీని లోకేష్ తెర మీదకు తెచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. మహిళలకు ఇందులో పెద్ద పీట వేసే అవకాశం ఉందనేది పార్టీ వర్గాల్లో చర్చ.
నేడు దేశంలో తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉంది. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఐడియాలజీ రూపొందించాల్సిన అవసరం ఉంది. తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసేందుకు, మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని యువనేత నారా లోకేష్ భావిస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా నెం.1గా ఎదగాలనే లక్ష్యంతో ‘నా తెలుగు కుటుంబం’ ఐడియాలజీని ప్రతిపాదించనున్నారు.
Also Read: Rahul Gandhi: జైశంకర్ రీల్స్ మాత్రమే చేయగలడు.. జైశంకర్‌పై రాహుల్ ఘాటు విమర్శలు..
Mahanadu Lokesh Mark: మహిళా సాధికారత, మహిళా శక్తిని చాటేలా స్త్రీశక్తి పేరుతో మద్దతు ఇవ్వనున్నారు. తెలుగుదేశం కారణంగా మహిళలకు ఆస్తి హక్కు వచ్చింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వారికి రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహించింది తెలుగుదేశం. దీంతో తెలుగు జాతి ఆడబిడ్డలు ఇప్పటికే సమాజంలో ముందంజలో ఉన్నారు. రానున్న రోజుల్లో స్త్రీ శక్తిని మరింత బలోపేతం చేసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
పేదరికం లేని సమాజం చూడాలన్నదే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ఇప్పటికే పీ4 విధానాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. వీటితో పాటు పేదరిక నిర్మూలనకు ప్రత్యేకమైన కార్యాచరణ అమలు చేయనున్నారు. టీడీపీ బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం దక్కేలా చేసింది. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్యాయంపై ఐడియాలజీని రూపొందించనున్నారు. ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను కూడా అందరి ఆమోదంతో పూర్తి చేశారు. ఇలా ప్రతి వర్గానికి న్యాయం చేసేలా సోషల్ రీ యింజనీరింగ్ చేయనున్నారు.
పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన చర్యలు, ఐడియాలజీపై చర్చించనున్నారు. మన రాష్ట్రంలో సమర్థులైన, మెరికల్లాంటి యువత ఉన్నారు. అయితే ఇప్పటికి కొన్ని వర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో యువతకు సరైన అవకాశాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అయ్యారు. ఇలాంటి వారికి అవకాశాలు సృష్టించి ప్రపంచ స్థాయికి తెలుగు యువతను తీసుకువెళ్లేందుకు నిరంతర ప్రణాళిక అమలు చేస్తారు.
Also Read: MLC Kavitha: కేసీఆర్ దేవుడు… ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి.
Mahanadu Lokesh Mark: రైతు లేకపోతే రాష్ట్రం లేదు.. సమాజమే లేదు. ఈ సిద్దాంతాన్ని బలంగా నమ్మే తెలుగుదేశం రైతుల జీవితాలు మార్చేందుకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, సాంకేతికంగా రైతును బలోపేతం చేయడం, సబ్సిడీలు ఇచ్చి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పంటలు పండించేలా చేయడంపై దృష్టిపెట్టనున్నారు. బంగారం లాంటి భూములు ఉన్న మన రాష్ట్రంలో.. వ్యవసాయాన్ని సరిగా ప్రమోట్ చేస్తే.. సంపద సృష్టి జరుగుతుంది. దీనిలో భాగంగా ‘అన్నదాతకు అండ’గా విధానాలను విస్తృత పరచనున్నారు.
దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా టీడీపీకి కోటి మంది సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మొదటినుంచీ వెన్నుదన్నుగా నిలుస్తున్న కార్యకర్తల సంక్షేమం కోసం, వారికి చేయూత అందించేలా ఐడియాలజీ రూపొందించనున్నారు. కార్యకర్తే అధినేత అనేది తెలుగుదేశం పార్టీ నినాదం, విధానంగా ఉండబోతుంది. సీనియర్లను గౌరవించడం, యువతను ప్రోత్సహించడం, కష్టపడేవారికి మద్దతుగా నిలవడం వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నారు. సంక్షేమం, గౌరవంతో కార్యకర్తే అధినేత అనేలా పార్టీ పనిచేయనుంది.
2024 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం జరుగుతున్న వేడుక ఈ మహానాడు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమికి 164 సీట్లతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రికార్డు స్థాయిలో 93 శాతం స్ట్రైక్ రేటు సాధించడం జరిగింది. ఈ విజయోత్సాహంతో ఎవరూ ఊహించని విధంగా ఈ సారి పసుపు పండుగ మహానాడును కడప శివారు గ్రామాల పరిధిలో అంగరంగవైభవంగా నిర్వహించబోతున్నారు. కడప జిల్లాలో 10 స్థానాల్లో 7 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. దీంతో టీడీపీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా మహానాడును కడపలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మహానాడు కడప జిల్లాలో పార్టీ బలోపేతానికి అతి పెద్ద అడుగు అని పార్టీ భావిస్తోంది.