Kavitha: బీఆర్‌ఎస్ ముఖ్యనేత, ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖపై స్పష్టతనిచ్చారు. “రెండు వారాల క్రితం కేసీఆర్ గారికి నేను లేఖ రాసిన సంగతి నిజమే,” అంటూ ఆమె వెల్లడించారు.
ఈ లేఖ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేకుండానే పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని రాసినదని స్పష్టం చేశారు. “లేఖ పూర్తిగా అంతర్గత అంశాలపై ఉంది. అలాంటి లేఖ బయటకు రావడం ఒక కుట్ర. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలి,” అని కవిత గారు మండిపడ్డారు.
కేసీఆర్ ను “దేవుడితో సమానమైన నాయకుడు”గా కొనియాడిన ఆమె, “కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు వున్నాయి. అవి బీఆర్‌ఎస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయి,” అని వ్యాఖ్యానించారు.
అయితే, బీఆర్‌ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతుందని, పార్టీలో ఉన్నంతవరకు ఆయన మార్గదర్శకత్వానికే కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని ఆమె హామీ ఇచ్చారు.