Maoists New Leader

Maoists New Leader: తెలంగాణ మల్లోజులకు మావోయిస్టు పార్టీ సారథ్య బాధ్యతలు?

Maoists New Leader: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్‌రహిత భారతావని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. నాలుగున్నర దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో తొలిసారి కేంద్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నేత నంబాల కేశవరావును హతమార్చాయి. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా 2024-25లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కాకులు దూరని కారడవులను చీల్చుకుంటూ, నక్సలైట్ల కంచుకోటలుగా ఉన్న దండకారణ్యంలోని ప్రాంతాలను భద్రతా బలగాలు ఒక్కొక్కటిగా ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఏడాదిన్నర కాలంలో 330 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఉద్యమానికి తీవ్ర నష్టం వాటిల్లింది. నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో అగ్రనాయకులు, కేశవరావు అంగరక్షకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు పత్రిక ‘అవామ్-ఇ-జంగ్’ చీఫ్ ఎడిటర్ సజ్జా వెంకట నాగేశ్వరరావు కూడా మృతి చెందినట్లు ప్రచారం జరుగుతున్నా, పోలీసులు దీనిని నిర్ధారించలేదు. కాల్పుల్లో ఒక డీఆర్‌జీ జవాను మృతి చెందగా, ఐదుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

మూడంచెల భద్రతతో ఉన్న కేశవరావు, అగ్రనాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు, డీవీసీఎం నేతలు అబూజ్‌మఢ్ అడవుల్లో సమావేశమైనట్లు ఈ నెల 19న ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. అదే రోజు తెల్లవారుజామున నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ బలగాలు, స్థానిక పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దశాబ్దాలుగా ఎత్తుకు పైఎత్తులు, వ్యూహాలకు ప్రతివ్యూహాలతో దండకారణ్యంలో సాగిన పోరులో, ‘ఆపరేషన్ కగార్’ కీలకమైంది. 2024లో దండకారణ్యంలో మావోయిస్టుల సంచారంపై ఉక్కుపాదం మోపేలా భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, అబూజ్‌మఢ్‌లో ముమ్మర కూంబింగ్‌లతో మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో కీకారణ్యంలో మావోయిస్టుల జాడను గుర్తించి, బలగాలు విజయవంతంగా దాడులు చేశాయి. 2024లో 215 మావోయిస్టులు, 2025 జనవరి నుంచి మే 21 వరకు 115 మంది మావోయిస్టులు మృతి చెందారు. మొత్తంగా ఏడాదిన్నరలో 330 మావోయిస్టులు హతమయ్యారు. కర్రెగుట్టల ఆపరేషన్‌లో వేలాది భద్రతా బలగాలతో 20 రోజుల పాటు సాగిన కూంబింగ్‌లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. కేశవరావు ఎన్‌కౌంటర్‌తో పార్టీలో తదుపరి సారథి ఎవరన్న ప్రశ్న ఏర్పడింది. కేంద్ర కమిటీలోని 17 మంది సభ్యుల్లో బెంగాల్‌కు చెందిన రాజన్‌కు, లేదంటే తెలంగాణకు చెందిన మల్లోజుల వేణుగోపాల్‌కు అవకాశం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది.

Also Read: Green Tax Pawan: ఆ డ్రైవర్‌ అన్నకి ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న పవన్‌

Maoists New Leader: మల్లోజుల వేణుగోపాల్ ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, దండకారణ్యంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే, మాజీ దళపతి గణపతికి మళ్లీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న 70 ఏళ్ల గణపతి, 2004-2018 వరకు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. కేశవరావు మరణంతో ప్రధాన కార్యదర్శి, మిలటరీ కమిషన్ ఇన్‌చార్జి పదవులు ఖాళీ అయ్యాయి. గడ్డు పరిస్థితుల్లో గణపతికి బాధ్యతలు అప్పగిస్తారా లేక కొత్త నాయకుడిని ఎంపిక చేస్తారా అన్నది త్వరలో తేలనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేశవరావు మృతిని నక్సలిజం నిర్మూలనలో మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నేత బల్లా రవీంద్రనాథ్… కేశవరావు ఎన్‌కౌంటర్‌ బూటకమని ఆరోపించారు. అనారోగ్యంతో ఒడిశాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేశవరావును పోలీసులు అదుపులోకి తీసుకుని ఎన్‌కౌంటర్ చేశారని బల్లా రవీంద్రనాథ్‌ ఆరోపించారు. ఈ ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *