Nambala Kesava Rao

Nambala Kesava Rao: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు హతం

Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలు చేపట్టిన భారీ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు టాప్ లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా హతమయ్యాడు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా సోషల్ మీడియాలో ధృవీకరించారు.

భద్రతా బలగాలకు ముందుగానే బసవరాజు అక్కడ ఉన్నట్టు సమాచారం అందడంతో మాధ్ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. తీవ్ర కాల్పుల తర్వాత బసవరాజు మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఆయనపై గతంలో రూ.1.5 కోట్ల నగదు రివార్డు ప్రకటించబడింది.

నంబాల కేశవరావు (67) మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఒకరు. 2018లో గణపతి రాజీనామా చేసిన తర్వాత, కేశవరావు మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్‌గా కూడా పనిచేశారు. గెరిల్లా యుద్ధాల రూపకల్పన, ఐఈడీల వినియోగం వంటి వ్యూహాత్మక చర్యలలో కేశవరావు నిపుణుడిగా పేరుగాంచారు.

నంబాల కేశవరావు ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామానికి చెందినవారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు కాగా, కేశవరావు టెక్కలిలో హైస్కూల్ చదివారు. తరువాత టెక్కలి జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసిన ఆయన, వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో (REC) ఇంజనీరింగ్ సీటు పొందారు. అదే సమయంలో ప్రజా ఉద్యమాల పట్ల ఆకర్షితుడై, విద్యార్థి దశలోనే మావోయిస్టు చట్రంలోకి అడుగుపెట్టారు.

Also Read: Pakistan Violent Protest: పాకిస్తాన్ లో నీటికోసం ఆందోళనలు.. మంత్రి ఇంటికి నిప్పు

Nambala Kesava Rao: 1980 దశకంలో పీపుల్స్ వార్ ఏర్పాటు సమయంలో కేశవరావు కీలక పాత్ర పోషించారు. మొదట తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో కమాండర్‌గా పనిచేశారు. కేశవరావు ఎన్‌కౌంటర్‌లో హతమవడం మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర ఇబ్బంది కలిగించనుందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

ఈ భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమంపై గట్టి దెబ్బ వేసిందని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, “దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు నా అభినందనలు,” అని ట్వీట్ చేశారు.

ఈ ఘర్షణలో మరణించిన మావోయిస్టుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. నంబాల కేశవరావు మృతి వలన మావోయిస్టు నేతృత్వంలో తలెత్తే మార్పులపై కేంద్ర, రాష్ట్ర బలగాలు మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *