NLG Cong vs Cong

NLG Cong vs Cong: కాంగ్రెస్‌లో రియాలిటీకి అద్ధం పడుతున్న తుంగతుర్తి!

NLG Cong vs Cong: సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం. అక్కడ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్ కోసం అరడజను మంది నేతలు పోటీపడ్డారు. కానీ అనూహ్యంగా బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మందుల సామెల్‌కు అవకాశం దక్కడంతో పార్టీ క్యాడర్ అంతా కలిసికట్టుగా సామెల్‌ను గెలిపించుకున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తమకు ఇక నుంచి మంచి రోజులు వచ్చాయని అనుకున్నారు అక్కడి కార్యకర్తలు. కానీ ఎమ్మెల్యే సామెల్ మాత్రం తనతో పాటు పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో అక్కడ పాత- కొత్తగా కాంగ్రెస్ క్యాడర్ విడిపోయింది. ఇంకేముంది ఆ వర్గపోరు కాస్త సొంత పార్టీ కార్యకర్తలనే పోలీస్ స్టేషన్‌లో వేసేవరకు, అంతటితో ఆగకుండా ఒకరిని ఒకరు తన్నుకునే వరకు వచ్చింది. తాజాగా అర్వపల్లిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారడం సంచలనంగా మారింది. తుంగతుర్తిలో పాత, కొత్త వర్గాలు కాంగ్రెస్‌ విడిపోయిన వైనానికి తాజా ఘటన అద్దం పడుతోంది. ఇందుకు ఎమ్మెల్యే సామెల్ వైఖరే కారణమని ప్రత్యర్ధి వర్గం అంటుండగా, దళిత ఎమ్మెల్యేపై అగ్రవర్గాల నేతలు కుట్రలు చేస్తున్నారని సామెల్ వర్గం ఆరోపిస్తోంది.

తుంగతుర్తిలో ఓ వర్గానికి ఎమ్మెల్యే మందుల సామేల్‌, ప్రత్యర్ధి వర్గానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ నుండి వలస వచ్చిన సామేల్‌‌.. తనని భారీ మెజారిటీతో గెలిపించిన పాత కాంగ్రెస్ కేడర్‌ను పూర్తిగా విస్మరిస్తున్నారనేది దామోదర్‌రెడ్డి వర్గం ప్రధాన ఆరోపణ. తాజాగా జరిగిన అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ ఎన్నిక ఈ వర్గపోరుకు మరింత ఆజ్యం పోసింది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి చెందిన అనిరెడ్డి రాజేందర్ రెడ్డి చైర్మన్‌గా ఎన్నిక కావడం.. మందుల సామేల్‌ ఆధిపత్యాన్ని దెబ్బ తీసినట్లయ్యింది. ఆలయ ఛైర్మెన్ ఎన్నిక విషయంలో దామోదర్ రెడ్డి వర్గం పైచేయి సాధించడం, సామెల్‌కు చేదు అనుభవం ఎదురయ్యేలా చేసింది. దీనికి తోడు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి దామోదర్ రెడ్డి ముఖ్య అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ వర్గం బలాన్ని చాటడం.. సామెల్ వర్గానికి పుండు మీద కారం చల్లినట్లయింది.

కాగా, తాజా పరిణామాలు, పార్టీలో జరుగుతున్న వ్యవహారం వెనక మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలున్నాయన్నది సీనియర్ల మాట. పార్టీలో అపార అనుభవం, పరిచయాలు ఉన్న దామోదర్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్‌లు మద్దతుగా ఉన్నారని పార్టీలో ప్రచారం సాగుతుంటే.. మరో వైపు ఛైర్మెన్ ఎన్నిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేను కాదని, ఆయనకు తెలియకుండానే ఎంపిక చేయడం, ఆయనకు పార్టీలో ప్రాధాన్యత కూడా తగ్గిందనే వాదనలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇక తాజాగా అర్వపల్లి కాంగ్రెస్ మీటింగ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సామెల్ ఫోటో చిన్నగా పెట్టడంతో రచ్చ మొదలై తన్నుకునే పరిస్థితికి వెళ్లింది.

Also Read: KTR: కేసీఆర్‌కు నోటీసులపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారు అంటే..?

పార్టీ పదవులు, అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే మాకు చెప్పే చేస్తున్నారా? పార్టీ కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారా? అంటూ దామోదర్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే వర్గంపై విరుచుకుపడింది. ఇక ఇక్కడే రచ్చ మొదలయ్యింది. దూషణలు కాస్తా ఘర్షణకు దారి తీసేలా చేసింది. రెండు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో పరిస్థితి గాడి తప్పింది. కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మరోసారి బహిర్గతమై పోయింది. రెండు వర్గాలు కుర్చీలు విసురుకుంటూ బాహాబాహికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఎవ్వరికి సర్ది చెప్పినా వినకపోవడంతో చివరికి ఖాకీలు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. ఘటనలో పలువురికి గాయ్యాలయ్యాయి. ఇక ఈ తాజా పంచాయితీ గాంధీభవన్ పెద్దల దాకా వెళ్లింది. ఎవ్వరికి సర్దిచెప్పాలో.. ఎవరిని బుజ్జగించాలో తెలియక తలలు పట్టుకోవాల్సిన వంతయ్యింది అధిష్టాన దూతలకు. మొత్తానికి ఈ ఆధిపత్య పోరుకు ఆదిలోనే పులిస్టాప్ పెట్టకపోతే రానున్న రోజుల్లో మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *