CM REVANTH REDDY: నల్లమల్ల ప్రాంతం నుంచి సీఎంగా మాట్లాడుతున్న సమయంలో తన గుండె ఉప్పొంగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారంలో “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు. గిరిజనుల సంక్షేమం కోసం రూ.12,600 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. పోడు భూములను సాగు భూములుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.
రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు, గిరిజన మహిళలకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. నల్లమల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మంత్రులను కోరారు. అచ్చంపేటను ప్రపంచంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
పోడు భూముల విషయానికొస్తే, గత పాలకులు పోడు రైతులను జైళ్లకు పంపించిన చరిత్రను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలతో గిరిజన రైతులకు తోడ్పాటునందిస్తోందని పేర్కొన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి పథకాలు రైతుల కోసమే అని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, ‘‘వరి వేసుకుంటే ఉరేయడం అన్నవారు, చివరికి తమ పొలంలో వరి వేసి అమ్ముకున్నారు’’ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కోటీ 35 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరిగిందని తెలిపారు.
సన్న బియ్యం పంపిణీపై మాట్లాడుతూ, ‘‘మీరు తింటున్నారా?’’ అని సభలో ప్రజలను అడగగా, జనం అందరూ తింటున్నామని సమాధానమిచ్చారు. పేదల ఇళ్లకు మంత్రులు వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలే ఆర్టీసీ బస్సులను అద్దెకు తిప్పుతున్నాయన్నారు. పలు మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చామని, హైటెక్ సిటీలో మూడు ఎకరాల స్థలం కేటాయించి మహిళల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించామని చెప్పారు.
ఇందిరా గాంధీని గుర్తు చేస్తూ, 50 ఏళ్ల తర్వాత దేశం మళ్లీ ఆమెను గుర్తు చేసుకుంటోందని అన్నారు. స్వాతంత్య్రం ఇవ్వడం మొదలు, భూముల పంపిణీ వరకూ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు మరిచిపోవద్దన్నారు. తెలంగాణ పన్నుల సేకరణలో దేశంలో మొదటి స్థానంలో ఉందని, పాలమూరు ప్రజలను చిన్నచూపు చూడకూడదని, ఇప్పుడు అదే పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని నడుపుతున్నాడని గర్వంగా చెప్పారు.
