AP News: రాజీనామాలు, మరణాలు వంటి కారణాల వల్ల రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం (మే 19) ఉదయం 11 గంటలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 28 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతుండగా, వాటిలో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల్లోని వివిధ పదవులు ఉన్నాయి.
మహా విశాఖతోపాటు పలు నగరాల్లో పరోక్ష ఎన్నికలు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ పదవితోపాటు, బొబ్బిలి (విజయనగరం), ఆదోని (కర్నూలు), కదిరి (శ్రీ సత్యసాయి), తిరువూరు (ఎన్టీఆర్) మున్సిపాలిటీల ఛైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. కదిరిలో ఇద్దరు వైస్ ఛైర్మన్ల పదవులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా మున్సిపాలిటీల్లో సోమవారం ఉదయం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, పరోక్ష ఎన్నికలు జరపనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఉపసర్పంచ్‌లకు ఎన్నికలు
శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట, రామగిరి, పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి, అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష పదవులకు మార్చిలో వాయిదా పడిన ఎన్నికలు ఈసారి నిర్వహించనున్నారు. అలాగే పల్నాడు, శ్రీకాకుళం, నెల్లూరు, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని వివిధ మండలాలలో మొత్తం 14 వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు జరుగుతాయి.
ఇది కూడా చదవండి: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..!
అదే విధంగా కొత్తవలస (విజయనగరం), చోడవరం (అనకాపల్లి), కడియం (తూర్పు గోదావరి) మండలాల్లో మండల కో–ఆపెరేటివ్ సభ్యుల పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ పదవుల కోసం కూడా ఓటింగ్ జరుగుతుంది. వీటిలో అత్యధికంగా పల్నాడు జిల్లాలోనే ఆరు మండలాల్లో ఏడు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల ఏర్పాట్లు – కోరం లేకపోతే వాయిదా
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సభ్యుల సంఖ్య లేకపోతే, సంబంధిత స్థానాల్లో ఎన్నికలను మంగళవారం (మే 20)కి వాయిదా వేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు.