Covid-19: ఐదేండ్ల క్రితం ప్రపంచాన్ని చుట్టేసి రెండేండ్ల పాటు అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కోట్లాది మంది ప్రాణాలను హరించింది. లక్షలాది కుటుంబాలను కన్నీటివరదలో ముంచేసింది. ఆర్థికంగా లక్షలాది మందిని కుదిపేసింది. ఉపాధి, ఉద్యోగావకాశాలను కొల్లగొట్టింది. అసలు ప్రపంచ తీరుతెన్నులను మార్చేసింది. ఆ ప్రభావం నుంచి ప్రపంచం తేరుకొని ఇప్పుడిప్పుడే స్థిమితం అవుతున్న వేళ మళ్లీ కరోనా భయాందోళన ప్రపంచాన్ని వణికిస్తున్నది. అలాంటి కొవిడ్ మళ్లీ మంచుకొస్తుందా? లాక్‌డౌన్ తప్పదా? అన్న ఆందోళన కలిగిస్తున్నది.
Covid-19: తాజాగా ఆసియా ఖండంలోని హాంకాంగ్, సింగపూర్ తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుదలే ఆ ఆందోళనకు కారణంగా కనిపిస్తున్నది. ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ కరోనా వ్యాపించగా, అక్కడి అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. దూరమైన కరోనా మళ్లీ ఎందుకొచ్చిందా? అన్న పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మునిగిపోయారు. మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Covid-19: ఆసియాలోనే మళ్లీ కరోనా ప్రబలే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ప్రధానంగా హాంకాంగ్ నగరంలో కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయని అక్కడి సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఔ తెలిపారు. కొవిడ్ టెస్టుల్లో అత్యధికంగా పాజిటివ్ రావడంతో కేసులు ఏడాది గరిష్టానికి చేరాయని తెలిపారు.
Covid-19: సింగపూర్ నగరంలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వేలాది కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఆసుపత్రుల పాలవుతున్న ప్రజల సంఖ్య 30 శాతం వరకు ఉన్నట్టు పేర్కొన్నది. ఈ పరిస్థితుల్లో అక్కడి ఆర్థిక, వాణిజ్య సంస్థలు ఆందోళనలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కొవిడ్ ప్రభావం మరింత ప్రమాద సంకేతాలను చూపుతున్నది.
Covid-19: ఇది ఆసియాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుందా? ప్రపంచమంతటికీ పాకుతుందా? అన్న ఆందోళన ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. అన్ని దేశాలు ఈ ఆందోళనతోనే ఉన్నాయి. ఆ భయాందోళన పరిస్థితులను తలుచుకొని బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రవాణా వ్యవస్థలు మొదట కట్టుదిట్టం చేయాల్సి ఉంటుందని, మళ్లీ లాక్‌డౌన్ ప్రవేశపెట్టే అవకాశం తప్పదేమోనని ఆందోళన చెందుతున్నారు.