Azma bukari: భారతదేశంపై ఇటీవల పాకిస్తాన్ చేపట్టిన సైనిక చర్యకు సంబంధించి, పీఎంఎల్-ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్) పార్టీ సీనియర్ నాయకురాలు, పంజాబ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి అజ్మా బుఖారీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ సైనిక చర్య పూర్తిగా వారి పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలోనే జరిగిందని ఆమె స్పష్టంగా తెలిపారు.
ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోదరుడైన నవాజ్ షరీఫ్ ఇప్పటికే మూడుసార్లు ప్రధాని పదవిలో పనిచేశారు. ఆయన నాయకత్వంలోనే పాకిస్థాన్ ఈ సైనిక చర్యను అమలు చేసిందని అజ్మా బుఖారీ పేర్కొన్నారు.
“నవాజ్ షరీఫ్ ఎవరూ సాధారణ నాయకుడు కాదు. ఆయన చేసిన పనులు ఆయన శక్తి సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి. పాకిస్థాన్‌ను అణు శక్తిగా మార్చిన నాయకుడు ఆయనే. ఇప్పుడు భారత్‌పై జరిగిన చర్య కూడా ఆయన మేథస్సు ఫలితమే,” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతిస్పందనగా, భారత్ మే 7వ తేదీ తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్) ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యసాధిత దాడులు చేపట్టింది.
దీని అనంతరం మే 8, 9, 10 తేదీల్లో పాకిస్థాన్ భారత సైనిక స్థావరాలపై ప్రతిదాడికి ప్రయత్నించింది. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే చివరకు శనివారం నాడు రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించి ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా ముందడుగు వేశాయి.

